సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 13: సంగారెడ్డి జిల్లాలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు తక్షణం మరమ్మతులు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం వివిధ ప్రభుత్వశాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో రోడ్డు, రవాణా సౌకర్యాలు లేని గిరిజన తండాలకు వెంటనే రవాణా సౌకర్యం కల్పించాలని, ప్రధాన రోడ్లకు అనుసంధానం చేయాలని సూచించారు. ఎస్టీ,ఎస్డీఎఫ్ నిధులను సమర్థవంతంగా వినియోగించాలన్నారు.
గిరిజన సంక్షేమం ద్వారా పంచాయతీరాజ్ విభాగం నుంచి మంజూరైన రహదారుల పనులకు టెండర్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. పాడైన రోడ్లు, కల్వర్టులకు ఉపాధి హామీ పథకం కింద ప్రతిపాదనలు తీసుకొని వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. సమీక్షా సమావేశంలో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి, పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ, గిరిజనసంక్షేమశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖల అధికారులు పాల్గొన్నారు.