హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న తేమ గాలుల వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఈ నెల 16 నుంచి 23 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వారంపాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ముఖ్యంగా 15,16 తేదీల్లో ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు తెలిపింది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్నదని వివరించింది.