Nizamabad | పోతంగల్, అక్టోబర్ 13: భారీ వర్షాలవల్ల వరదలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, ప్రభుత్వం సన్నలకు బోనస్ పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. పోతంగల్ మండల కేంద్రంలో అన్నదాతలు సోమవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి బోనస్‌తో పాటు భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు.
ఎమ్మార్వో వచ్చేంతవరకు కదిలేదే లేదని భీష్మించుకుకూర్చున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మండలంలోని మంజీరా పరివాహక ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదల వల్ల వేల ఎకరాల పంటలు నీట మునిగి తాము నష్టపోయామని, అధికారులు వచ్చి పంటలు పరిశీలించినప్పటికీ నష్టపరిహారం అందించలేదని మండిపడ్డారు. నష్ట పోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల నష్ట పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సన్న రకం ధాన్యం పండిస్తే బోనస్ వస్తుందని, ఆశతో గత సీజన్లో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకుండా అకాల వర్షాలనుండి ధాన్యాన్ని కాపాడుకొని ఆరబెట్టి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల విక్రయించామని, ఇప్పుడు వర్షాకాలం పంట చేతికొచ్చిన ఇప్పటివరకు బోనస్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది భారీ వర్షాలతో పంటలు నష్టపోయి దిగుబడి లేక తాము ఇబ్బందుల్లో ఉన్నామని, ప్రభుత్వం వెంటనే బోనస్‌పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోయా పంట చేతికొచ్చి నెల రోజులు గడుస్తున్న ప్రభుత్వం కొనుగోలు చేసే ఉసే లేదని మండిపడ్డారు. సోయా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ ఎమ్మార్వో అబ్ధుల్ అజీజ్ సంఘటనా స్థలానికి చేరుకోవడంతో డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. తమ సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కల్లూరి హాన్మండ్లు, ప్రకాష్ పటేల్, గంగాధర్ పటేల్, విజయ్ పటేల్, మక్కయ్య, పబ్బ శేఖర్, నాగనాథ్ పటేల్, ఒమన్న పటేల్, హరి నర్సింగ్, రాజు పటేల్, దిగంబర్ పటేల్, మగిరి శ్రీనివాస్, దుమలే సురేష్, మారుతీ పటేల్, సురేష్ చుట్టుపక్కల గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.