Self-employment | కోటగిరి, అక్టోబర్ 13 : కుట్టు మిషన్ శిక్షణతో మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని ఐసీడీఎస్ బోధన్ ప్రాజెక్టు సీడీపీవో పద్మజ అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో హోప్ ఫర్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధన్ సీడీపీవో పద్మజ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళకు పలు సలహాలు సూచనలు ఇచ్చి ఆమె మాట్లాడారు. మహిళల్లో పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చని పేర్కొన్నారు.
మహిళలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలిక్కి తీయాలని సూచించారు. ఈరోజు మార్కెట్లో మంచి డిజైన్ బ్లౌజులకు మంచి డిమాండ్ ఉందని, కావున మహిళలు కుట్టు మిషన్ శిక్షణ చక్కగా నేర్చుకొని మంచి డిజైన్లతో కూడిన బ్లౌజులు, డ్రెస్సులు తయారు చేయాలని చెప్పారు. 45 రోజులపాటు క్రమం తప్పకుండా ఈ కుట్టు మిషన్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మహిళ కోసం ఉచితంగా ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన హోప్ ఫర్ లైఫ్ స్వచ్ఛంద సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధి రమేష్, ఐసీడీఎస్ కోటగిరి సెక్టార్ సూపర్ వైజర్ కొమ్మురవ్వ, అంగన్వాడీ టీచర్లు కళావతి, సావిత్రి, గంగామణి తదితరులు పాల్గొన్నారు.