ప్రజా ప్రయోజనాల విషయంలో ప్రభుత్వాలు అస్సలు రాజీ పడకూడదు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన అంశాల్లో ఎంతమాత్రం తావులేదు.
అయితే ఇటీవలి జీఎస్టీ సంస్కరణల్లో మోదీ సర్కారు తీరు చూస్తుంటే ఇందుకు విరుద్ధంగానే నిర్ణయాలు జరిగినట్టు స్పష్టంగా తెలుస్తున్నది. కూల్‌డ్రింక్స్ సహా ఇతర శీతల పానీయాలను ఆల్కహాల్, పొగాకు వంటి ఆరోగ్యానికి హానికర వస్తూత్పత్తుల జాబితాలో చేర్చి గరిష్ఠంగా 40 శాతం పన్ను విధించారు.
మరోవైపు మిఠాయిలపై పన్నును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. దీంతో ఆరోగ్య రంగ నిపుణులు విస్తుపోతున్నారు. ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధతోనే పన్నుల నిర్ధారణ జరిగితే ఎందుకీ తేడాలు? అని ప్రశ్నిస్తున్నారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఇటీవలి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సవరణల్లో కేంద్ర ప్రభుత్వం ఓ సందేశాన్నిచ్చింది. కూల్‌డ్రింక్స్, ఐస్డ్ టీలు, ఎనర్జీ బేవరేజెస్, ఇతర చక్కెర ఆధారిత శీతల పానీయాలు ఆరోగ్యానికి హానికరమన్నదే అది. అందుకే గరిష్ఠంగా 40 శాతం పన్ను వేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో షుగర్ అనేది కేవలం ఆహారం మాత్రమే కాదు.. ప్రజల ఆరోగ్యం కూడా. కాబట్టి ఈ పన్ను భారం సరైనదేననుకోవచ్చు. అయితే గులాబ్ జామూన్, కాజూ కట్లీ, రసగుల్లా, హల్వా తదితర మిఠాయిలపై పన్నును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. మరి ఇదేం లెక్క అన్నదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. చక్కెర వినియోగం ఆరోగ్యానికి హానికరమే అని జీఎస్టీ కౌన్సిల్ భావించినప్పుడు.. కోలాలు, కూల్‌డ్రింక్స్‌తోపాటు మిఠాయిలపైనా గరిష్ఠ పన్నునే వేయాలి కదా అని నిపుణులు నిలదీస్తున్నారు. ప్రజారోగ్యం శీతల పానీయాల అంశంలోనే గుర్తొస్తుందా? అన్నది వారి వాదన. మరి.. మోతాదుకు మించిన చక్కెర.. పెట్ బాటిల్స్‌లో ఉన్నా, సంప్రదాయ స్వీట్ బాక్సుల్లో ఉన్నా ప్రమాదమే కదా.
భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వివరాల ప్రకారం.. మనం రోజూ తీసుకునే క్యాలరీల్లో చక్కెర ద్వారా వచ్చేవి 5 శాతాన్ని మించకూడదు. నిజానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచించిన 10 శాతం కంటే ఇది తక్కువే. దేశంలో పెరుగుతున్న చక్కెర వినియోగం, తద్వారా వస్తున్న అనారోగ్య సమస్యలకు ఐసీఎంఆర్ మార్గదర్శకాలు నిదర్శనం. ఇక నగర, పట్టణ ప్రాంత ప్రజలు రోజూ 80-90 గ్రాముల చక్కెరను తింటున్నారు. అసలు మోతాదు కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. స్వీట్ల విషయానికొస్తే.. భారతీయులకు ఎంతో ప్రత్యేకం. ఇవి లేకుండా పండుగలు, శుభకార్యాలను ఊహించలేమంటే అతిశయోక్తి కాదు. అయితే కార్బోనేటెడ్ డ్రింక్స్‌తో పోల్చితే ఈ మిఠాయిల్లో వాడే చక్కెర శాతమే ఎక్కువ. ఒక్క గులాబ్ జామూన్లో 56 గ్రాముల పిండి పదార్థాలుంటాయి. వీటిలో చక్కెరే అధికం. అయితే 250 ఎంఎల్ కూల్‌డ్రింక్‌లో 26 గ్రాములే ఉంటాయి. దీంతో మిఠాయిలు మితిమీరి తింటే శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరిగి ఫ్యాటీ లివర్, ఊబకాయం, డయాబెటిస్, మెటబాలిక్ డిస్ఫంక్షన్ సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశంలో 10.1 కోట్ల షుగర్ వ్యాధిగ్రస్తులున్నారు. మరో 13.6 కోట్ల మందికి షుగర్ వ్యాధి ముప్పు పొంచి ఉన్నదని లెక్కలు చెప్తున్నాయి. అంటే ప్రతీ ఐదుగురిలో దాదాపు ఒకరికి షుగర్ వ్యాధి లక్షణాలున్నాయని చెప్పవచ్చు. అయినప్పటికీ మన జీఎస్టీ కౌన్సిల్ దీన్ని పూర్తిగా విస్మరించింది. పాశ్చాత్య సంస్కృతి పేరిట కోలాలపై పన్నును పెంచి సంప్రదాయం ముసుగులో మిఠాయిలకు తగ్గించింది.
మిఠాయిలపై జీఎస్టీని తగ్గించడం వెనుక మోదీ సర్కారు రాజకీయ ప్రయోజనాలున్నాయన్న వాదనలు ఇప్పుడు అంతటా గట్టిగా వినిపిస్తున్నాయి. మిఠాయి వ్యాపార సంఘాల నుంచి, ముఖ్యంగా గుజరాత్, ఇతర ఉత్తరాది రాష్ర్టాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందనే పన్ను భారాన్ని గతంతో పోల్చితే 13 శాతం దించారని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య నిపుణులు ఈ తరహా విధానాలు సరికావని ఖండిస్తున్నారు. చక్కెర వినియోగం బాగా తగ్గాలని, లేకుంటే భవిష్యత్తు తరాలకు పెద్ద ముప్పుగా పరిణమిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. కోలాలు, ఇతర బేవరేజెస్‌తో ఆరోగ్యానికి ఎంత ప్రమాదం ఉందో.. మిఠాయిలతో కూడా అంతేనని, ఈ విషయంలో రాజకీయాలను పక్కనబెట్టి, ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని కోరుతున్నారు.
చక్కెర ఆధారిత పానీయాలపై 40 శాతం జీఎస్టీ మంచిదే. ఈ నిర్ణయం ఆధునిక పోకడలకు, ముఖ్యంగా యువతకు వ్యసనంగా మారిన ఆయా కూల్‌డ్రింక్స్, ఎనర్జీ బేవరేజెస్ వినియోగానికి కొంతైనా అడ్డుకట్ట వేయగలదు. అయితే మారిన జీవనశైలితో వచ్చే వ్యాధులపై కేంద్ర ప్రభుత్వానికి నిజంగా ఆందోళన, చిత్తశుద్ధే ఉంటే చేయాల్సినవి ఇవి.. అంటూ ఆరోగ్య రంగ నిపుణులు సూచిస్తున్నారు.
కృత్రిమంగా చక్కెరను వినియోగించి తయారుచేసిన కార్బోనేటెడ్, నాన్-ఆల్కహాలిక్ బేవరేజెస్‌తో ఆరోగ్యానికి హానికరం. అందుకే వీటిపై గరిష్ఠంగా 40 శాతం జీఎస్టీని విధిస్తున్నాం. అయితే సంప్రదాయ మిఠాయిలు, ఆయా తీపి పదార్థాలపై పన్నును గతంతో పోల్చితే 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నాం.
చక్కెర ఆధారిత పానీయాలపై 40 శాతం జీఎస్టీ సరైనదే. కానీ గులాబ్ జామూన్ తదితర సంప్రదాయ భారతీయ మిఠాయిలకు పన్నును ఏ ప్రాతిపదికన తగ్గించారో తెలియట్లేదు. నిజానికి ఆ శీతల పానీయాల కంటే చక్కెర స్థాయిలు వీటిలోనే ఎక్కువ. మరి అవి అనారోగ్యమైనప్పుడు ఇవి ఆరోగ్యకరం ఎలా?
పోషకాలపరంగా స్వీట్లు శక్తివంతమైనవి, గాఢమైనవి. అందుకే చాలామంది భారతీయులు వీటిని ఎక్కువగా ఇష్టపడి తింటూంటారు. అయితే ఇవి కృత్రిమమైనవి. కాబట్టి సంప్రదాయం, సంస్కృతి మాటెలా ఉన్నా మోతాదు మించితే అనారోగ్యమేనని గుర్తుంచుకోవాలి.
– వినితా బాలా, పోషకాహార నిపుణులు
రిఫైన్డ్ షుగర్ అనేది ఓ నిజమైన వ్యసనం. ఆల్కహాల్, పొగాకు కానప్పటికీ దీని వినియోగదారులు చిన్న వయసులోనే రోగాలబారిన పడాల్సి వస్తున్నది. 35 ఏండ్లకే ఫ్యాటీ లివర్ సమస్యతో వస్తుండటం.. కేవలం చక్కెర ఆధారిత స్వీట్లు ఎక్కువగా తినడం వల్లే.
-డాక్టర్ సుదర్శన్ రెడ్డి, డయాబెటాలజిస్ట్
ఇంట్లో చేసిన మిఠాయిలు ఆరోగ్యకరం అనడం గందరగోళంగా అనిపిస్తుంది. నిజానికి ఓ సాఫ్ట్ డ్రింక్ కంటే ఓ గులాబ్ జామూన్లో చక్కెర పరిమాణం చాలా ఎక్కువ. అయినప్పటికీ కూల్‌డ్రింక్స్ తాగితేనే ఆరోగ్యం పాడైపోతుందన్న భ్రమలో జీవించేస్తున్నాం. మోతాదుకు మించి చక్కెరను ఎలా తీసుకున్నా ప్రాణాలకు ముప్పే.
-డాక్టర్ ముఖర్జీ మడివాడ, ఫోర్టిస్ హాస్పిటల్