హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సర్కారు బడులు దాదాపు నిర్వీర్యమయ్యే దశకు చేరుకున్నాయి. సర్కారు బడుల్లో ఒకటో తరగతిలో ఎన్రోల్మెంట్ రానురాను పడిపోతుండటమే ఇందుకు నిదర్శనం. 2024 -25 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో బడీడుకొచ్చిన ప్రతి 100 మందిలో 74 మంది విద్యార్థులు ప్రైవేట్ బడుల్లోనే చేరిపోయారు. కేవలం 26 మంది సర్కారు బడుల్లో నమోదయ్యారు. ఈ విషయాన్ని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (యూడైస్) 2024-25 నివేదిక వెల్లడించింది. 2022-23 విద్యాసంవత్సరంలో ఒకటో తరగతి ఎన్రోల్మెంట్ సర్కారు బడుల్లో 40% ఉండగా, ప్రైవేట్లో 60% ఉన్నది. ఇది 2023 -24కు వచ్చేసరికి సర్కారు బడుల్లో 32, ప్రైవేట్ 68 శాతానికి చేరింది. 2024-25కు వచ్చేసరికి ముప్పావు మంది విద్యార్థులు ప్రైవేటులో చేరగా, పావు వంతు పిల్లలే సర్కారు బడుల్లో చేరారు. ఈ మూడేండ్ల వ్యవధిలోనే సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్ 14% మేర పడిపోయింది. ఈ పరిస్థితి కొనసాగితే అనతికాలంలోనే జీరో ఎన్రోల్మెంట్ బడుల సంఖ్య గణనీయంగా పెరిగే ప్రమాదమున్నది.