సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పోలీసు విభాగంలో కలకలం మొదలైంది. తమకు ప్రమోషన్ల విషయంలో ఉన్నతాధికారులు అన్యాయం చేస్తున్నారని, రాజకీయ జోక్యంతో తమకు న్యాయంగా దక్కాల్సిన పదోన్నతులు దక్కకుండా పోతున్నాయని రెండు బ్యాచ్‌ల పోలీసులు కీలక నిర్ణయానికి సిద్ధమయ్యారు. తమ బాధ సీఎం వరకు తెలియాలంటే సామూహిక సెలవు లేదా రాజీనామానే మార్గమని భావిస్తున్నారు. ఈ క్రమంలో వారు త్వరలోనే ఓ నిర్ణయం ప్రకటించబోతున్నారని తెలిసింది. ఓ జోన్ పోలీసులపై ముఖ్యనేత లావాదేవీల ప్రేమ కారణంగా తమకు అన్యాయం జరుగుతున్నదని వాపోతున్నారు. ఆ జోన్ పోలీసులకు నిబంధనలకు విరుద్ధంగా 80పోస్టులు దక్కడంతోపాటు తమకు రావాల్సిన 126 పోస్టులకు బదులు 18 మాత్రమే ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ రేంజ్, వరంగల్ రేంజ్‌లలో సిటీ పోలీసులకు జరుగుతున్న అన్యాయంపై వారంతా యూనిఫామ్ సర్వీసెస్‌లో ఉన్నప్పటికీ ఏదేమైనా సరే.. తమకు న్యాయం జరిగేవరకు పోరాడాల్సిందేనని నిర్ణయించుకున్నారు. ఈనెల 6న వచ్చిన షోకాజ్ నోటీసులపై యుద్ధం ప్రకటిస్తూ కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న ఓ కీలకనేత ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతూ ఓ రేంజ్‌కు చెందిన వారికి లబ్ది చేకూర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ పోలీసులంతా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సిటీ పోలీసు విబాగంలోకి 1989,91లలో ఎస్సైలుగా ఎంపికై ప్రస్తుతం డీఎస్పీ, అదనపు ఎస్పీ హోదాల్లో పనిచేస్తున్న అధికారులలో కొందరు సంచలనాత్మక నిర్ణయం తీసుకోబోతున్నారు. పదోన్నతులకు సంబంధించిన సీనియార్టీ జాబితా ఖరారులో రాజకీయ జోక్యం, తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి సామూహికంగా సెలవులో వెళ్లాలని, లేకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేయాలని భావిస్తున్నారు. 1972 నుంచి ఇప్పటివరకు సీనియార్టీ సెటిల్ చేయడం లేదని వారు చెబుతున్నారు. సిటీ పోలీసులకు సంబంధించినంతవరకు ఉమ్మడి ఏపీలో అన్ని జిల్లాల నుంచి పోలీసులుగా సెలక్ట్ అయినవారు ఉన్నప్పటికీ 2002లో వీరికి సంబంధించిన సిటీ జోన్‌ను రద్దు చేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆతర్వాత 2009లో మళ్లీ సిటీ పోలీసులు కోర్టు ద్వారా తమ రేంజ్ ఉంచేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే గత కొన్నేళ్లుగా తమ కంటే జూనియర్లుగా వచ్చిన వారందరికీ ప్రమోషన్లు దక్కుతున్నాయి తప్ప.. తాము మాత్రం ఆ జాబితాలో చేరడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పోలీసు విభాగంలో వివిధ క్యాడర్ పోస్టులు ఉంటాయి. వీటిలో ఉండే ఖాళీలు, కొత్తగా కేటాయించే పోస్టుల ఆధారంగానే పదోన్నతులు జరుగుతుంటాయి. ఆరో రేంజ్‌గా పరిగణించే హైదరాబాద్ రేంజ్‌లోకి ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర,మెదక్,నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఈజోన్‌లో 1978బ్యాచ్ అధికారులు లేకపోవడం, 1985 లో కేవలం 16 మందే ఉండటంతో పాటు సైబరాబాద్ కమిషనరేట్,ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో పోస్టులు పెరిగాయి. ఇలా ఈ రేంజ్‌కు చెందిన వారికి మిగిలిన వాటికి చెందిన వారికంటే ముందుగానే ఇన్స్పెక్టర్ పదోన్నతులు వచ్చాయి.
ఎవరైనా ఓ అధికారికి డీఎస్పీగా పదోన్నతి ఇవ్వాలంటే ఆయన ఏ బ్యాచ్‌కు చెందినప్పటికీ ఇన్స్పెక్టర్ పదోన్నతి పొందిన తేదీనే్రప్రామాణికం అవుతుంది. దీని ఆధారంగానే డీఎస్పీ పదోన్నతి జాబితా రూపొందుతుంది. హైదరాబాద్ రేంజ్లో ఉన్న అవకాశాలతో పాటు ఇక్కడి వారు ఇతర రేంజ్‌లకు చెందిన వారి కంటే త్వరగా డీఎస్పీలు అయ్యారు . రాష్ట్ర విభజన తర్వాత క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీగా ఉన్న ఏపీ పోలీసు విభాగం డీఎస్పీల సీనియార్టీ జాబితా రూపొందించింది.దీన్ని ఖరారు చేస్తూ 2018లో జీవోనెం.153 జారీ అయింది. దీనికి కొనసాగింపుగా 2022 డిసెంబర్ 29న జీవోనెం.74తో మరో జాబితావచ్చింది. దీని ఆధారంగానే 81 మందికి అదనపు ఎస్పీలుగా పదోన్నతులు రావడంతో పాటు కొందరికి ఐపీఎస్కూడా ఖరారైంది. ఈ రెండు సందర్భాల్లోనూ కొందరు అధికారులు తాము మిగిలిన వారికంటే సీనియర్లమంటూ అభ్యంతరాలు చప్పినా పసలేని కారణంగా పోలీసు విభాగం పరిగణనలోకి తీసుకోలేదు. ఉత్తర తెలంగాణకు చెందిన ఓరేంజ్కు చెందినవారికి లబ్ది చేకూర్చడానికి ప్రభుత్వంలో ముఖ్యనేతకు సన్నిహితుడు, సలహాదారు అయిన ఓ కీలక నేత జోక్యంతో కథ అడ్డం తిరిగింది. ఆయన తన అధికార బలంతో చేసిన పనితో గత ఏడాది జూలై3న మరో పదోన్నతుల జాబితా రూపొందించారు. జీవోనెం.74కు కాస్త భిన్నంగా ఇది రూపొందడంతో సిటీ అధికారులు వెనకబడిపోయారు. అప్పటికీ సంతృప్తి చెందని నేత ఈనెల 6న మరో జాబితా వెలువడేలా చేశారు. దీంతో హైదరాబాద్ అధికారుల పేర్లు మరింత వెనకబడిపోయాయి. ఈ రెండు జాబితాలు ఒకే డీఐజీ రూపొందించడం గమనార్హం. ఇందులో కొందరు అధికారుల ఇన్స్పెక్టర్ పదోన్నతుల తేదీలు మార్చేశారు. దానికి ప్రామాణికం ఏమిటన్నది మాత్రం స్పష్టంగా చెప్పడం లేదు. దీంతో హైదరాబాద్ రేంజ్‌కు చెందిన అనేక మంది పదోన్నతి పొందకుండా పదవీవిరమణ చేసే పరిస్థితులు తలెత్తాయి. కేవలం 1989, 1991 బ్యాచ్‌ల వారే కాకుండా 1996, 1998, 2002, 2004 బ్యాచ్‌లకు చెందిన వారిపైనా కూడా ఈ ప్రభావం పడనున్నది.