హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : గల్ఫ్ పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు రైజింగ్ తెలంగాణలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ వీకెండ్-దుబాయి 2025’లో భాగంగా యూఏఈలో నిర్వహించిన సౌత్ ఇండియన్ బిజినెస్ అచీవర్స్ అవార్డు(సైబా) ప్రధానోత్సవానికి ఆయన అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గడిచిన ఏడాదిన్నరల్లో రాష్ట్రం లైఫ్ సైన్సెస్, ఈవీ, ఏరోస్పేస్, లాజిస్టిక్స్, ఏఐ, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాల్లో రూ.3.28 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందన్నారు. ఎలీ లిల్లీ లాంటి అనేక ప్రపంచ దిగ్గజ సంస్థలు తెలంగాణను తమ గమ్యస్థానంగా మార్చుకున్నాయని చెప్పారు. ఇప్పటికే యూఏఈ ఇన్వెస్టర్లు రూ.2 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారని, ఇది తెలంగాణ-దుబాయి మధ్య రోజురోజుకీ బలపడుతున్న వాణిజ్య సంబంధాలకు చిహ్నంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు.