న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: కరూర్ వైశ్యా బ్యాంక్ వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు లేదా 0.10 శాతం కోత పెట్టింది. ఈ తగ్గింపు అన్ని కాలపరిమితులతో కూడిన రుణాలకు వర్తించనున్నదని పేర్కొంది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో అత్యధికంగా తీసుకునే వాహన, వ్యక్తిగత ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ 9.45 శాతానికి దిగొచ్చింది.
అంతకుముందు ఇది 9.55 శాతంగా ఉన్నది. నెల, మూడు, ఆరు నెలల కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు 9.30 శాతం నుంచి 9.45 శాతం మధ్యలోకి దిగొచ్చింది. అలాగే ఒక్కరోజు రుణాలపై వడ్డీరేటు 9.25 శాతం నుంచి 9.15 శాతానికి దించింది. ఈ వడ్డీరేట్లు ఈ నెల 7 నుంచి అమలులోకి రానున్నాయి.