న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5 (స్పెషల్టాస్క్ బ్యూరో): ఒకవైపు సుంకాలు.. మరోవైపు వలస విధానాలపై కఠిన నిర్ణయాలు.. వెరసి భారత్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ట్రంప్ సర్కారు ఇప్పటికే తీసుకొచ్చిన కొత్త వీసా నిబంధనలతో అమెరికాలోని భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు దీనికి ఆజ్యం పోసేలా ట్రంప్ మద్దతుదారులు భారత వ్యతిరేక ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. ‘ఇండియన్స్.. గెట్ అవుట్’, ‘మీతో యూఎస్ ఇప్పటికే నిండిపోయింది. కొత్తవారు వద్దు’ అంటూ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా) మద్దతుదారులు, ట్రంప్ అనుకూలురు పలు పోస్టులు పెడుతున్నారు. ఆన్లైన్ ప్రచారం ఉధృతం కావడంతో అమెరికాలోని భారతీయులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.
జనవరి 20న అధికారంలోకి వచ్చింది మొదలు అక్రమ వలస లు, హెచ్1బీ వీసాలు, గ్రీన్‌కార్డు, జన్మతః పౌరసత్వ రద్దు, ఎఫ్1, ఓపీటీ.. ఇలా ప్రతీ అంశంలో ట్రంప్ సర్కారు తీసుకొంటున్న నిర్ణయాలు భారతీయులకు కునుకులేకుండా చేస్తున్నది. ‘అమెరికా ఫస్ట్’, ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) నినాదాల్ని చూపిస్తూ విదేశీయులపై ట్రంప్ విధిస్తున్న ఆంక్షలు.. ఇండియన్ల ‘డాలర్ డ్రీమ్స్’ను కల్లలుగా మారుస్తున్నాయి. భారతీయ వస్తువులపై 50 శాతం దిగుమతి సుంకం విధింపు నిర్ణయం దరిమిలా యూఎస్-ఇండియా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యేలా చేశాయి. ఈక్రమంలో ట్రంప్ ఎన్నికల నినాదం మేక్ అమెరికా గ్రేట్ అగైన్(మాగా) ప్రచారకులు సోషల్ మీడియా వేదికగా భారత వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరం చేశారు. భారత్‌పై ట్రంప్ తీసుకొన్న తాజా చర్యలను గట్టిగా సమర్థిస్తున్న కన్జర్వేటివ్ ప్రముఖులు.. భారతీయ ఉద్యోగులతోపాటు కాల్ సెంటర్లపై కూడా తమ సోషల్ మీడియా వేదికల ద్వారా విద్వేష ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. వీరందరికీ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోవర్లు ఉండడంతో తక్కువ వ్యవధిలోనే ఈ ప్రచారం దావానలంలా వ్యాపించింది.
భారతీయులు అమెరికాకు వలస రావడంతో తాము ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నామని మాగా ప్రతినిధులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొంటే.. మరిన్ని కొత్త వీసాలు ఇవ్వాల్సి వస్తుందని, అది తమకు ఇష్టం లేదని సూటిగా చెప్తున్నారు. ఇప్పటికే భారతీయులతో అమెరికా నిండిపోయిందని, కొత్తగా ఎవరూ రావాల్సిన అవసరం లేదని తేల్చిచెప్తున్నారు. అమెరికన్ ఉద్యోగులను భారతీయ ప్రొఫెషనల్స్ నిరుద్యోగులుగా మారుస్తున్నారని మండిపడుతున్నారు. భారత్‌కు చెందిన ఔట్సోర్సింగ్ పరిశ్రమలు ఆధిపత్యం చెలాయిస్తున్న రంగాలపై 100 శాతం సుంకాలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ‘గెట్ అవుట్.. ఇండియన్స్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ-అమెరికన్ ఓటర్లు సంప్రదాయంగా డెమోక్రాట్ అభ్యర్థిని బలపరుస్తారు. అయితే, 2024 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థిని కాదని మొదటిసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌నకు మెజారిటీ ప్రజలు ఓటు వేశారు. అయితే అధికారంలోకి రాగానే.. ‘మాగా’ పేరిట భారత్ సహా పలు దేశాలపై ట్రంప్ ఆంక్షల కత్తిని దూయడం ప్రారంభించారు. అమెరికా-భారత్ వాణిజ్య సంబంధాలు తమ దేశాన్ని ఏకపక్షంగా నష్టానికి గురిచేస్తున్నాయని, తమ ఉత్పత్తులపై భారత్ విపరీతంగా సుంకాలు వేస్తున్నదంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల ద్వారా లాభాలు గడిస్తూ భారత్.. అమెరికన్ వస్తువులపై అక్రమ సుంకాలు విధిస్తోందని కూడా ఆరోపించారు. అంతకుముందే వలసదారులపై కఠిన ఆంక్షలను తీసుకొచ్చారు. ట్రంప్ విధానాలను ప్రోత్సహించిన మాగా మద్దతుదారులు భారత్‌కు వ్యతిరేకంగా ఆన్‌లైన్‌లోనూ విద్వేష ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో పలువురు మితవాదులు పాల్గొన్నప్పటికీ కొందరు మాత్రం ఈ వాదనను వ్యతిరేకిస్తుండటం కొంత ఊరట కలిగిస్తున్నది. ఎన్నికల్లో ట్రంప్‌ను గెలిపించడానికి సాయపడిన భారతీయ-అమెరికన్లు ఇప్పుడు తాజాగా నెలకొన్న పరిణామాలతో పశ్చాత్తాపం చెందుతున్నారని వారు తెలిపారు. వీసాలపై కోత, ఇమిగ్రేషన్ ఆంక్షలు వంటి తాజా పరిణామాలతో పలువురు భారతీయ-అమెరికన్లు ట్రంప్‌ను బలపరిచినందుకు ఇప్పుడు విచారిస్తున్నట్లు నెటిజన్ ఒకరు పోస్టు చేశారు. ‘కష్టపడి పనిచేసే ఇమిగ్రెంట్స్తో పోటీపడడం చేతకాని కొందరు కన్జర్వేటివ్‌లు చేస్తున్న దుష్ప్రచారమే ఇది’ అని జర్నలిస్టు బిల్లీ బినియన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ తన విధానాలతో దశాబ్దాల ద్వైపాక్షిక సంబంధాలకు ముప్పు తీసుకు వస్తున్నారని భారతీయ అమెరికన్ పార్లమెంట్ సభ్యుడు రో ఖన్నా ఆరోపించారు. ట్రంప్ తన అహంకారంతో భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలను నాశనం చేయడాన్ని తాము ఎంతమాత్రం అనుమతించబోమని స్పష్టం చేశారు.
అమెరికా నుంచి భారతీయులను వెళ్లగొడితే అగ్రరాజ్యానికి కూడా నష్టమేనని మరికొందరు మేధావులు వాదిస్తున్నారు. అమెరికా జారీ చేసే హెచ్-1బీ వీసాదారులలో 75 శాతం మంది భారతీయులే ఉన్నారు. సిలికాన్ వ్యాలీలోని గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ టెక్ సంస్థలలో భారతీయులే అత్యధికంగా పనిచేస్తున్నారు. అమెరికాలోని విశ్వ విద్యాలయాల్లో ఎంత లేదన్నా 2 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతున్నారు. అంటే అమెరికా కంపెనీలకు సాంకేతిక సాయాన్ని, యూనివర్సిటీలకు బడ్జెట్లు, స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ఆదాయాన్ని కోట్లాది డాలర్ల రూపంలో భారతీయ ఉద్యోగులు, విద్యార్థులు కల్పిస్తున్నారు. ఇప్పుడు భారతీయుల ప్రవేశాన్ని అడ్డుకోవడం వల్ల అమెరికన్ యూనివర్సిటీలు, కంపెనీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నదని నిపుణులు, ట్రంప్ వ్యతిరేకులు వాదిస్తున్నారు. అది అమెరికాకు కూడా నష్టమేనని చెప్తున్నారు.
వాషింగ్టన్, సెప్టెంబర్ 5: వాషింగ్టన్‌ను న్యూఢిల్లీ ఎక్కువ కాలం ధిక్కరించ లేదని అమెరికా వాణిజ్య మంత్రి హువార్డ్ లుట్నిక్ పేర్కొన్నారు. కెనడా గతంలో అమెరికాతో గొడవపడి టారిఫ్‌లు ఎదుర్కొన్న తరహాలోనే భారత్ తన వైఖరిని మార్చుకోకుంటే అమెరికాకు చేసే ఎగుమతులపై 50 శాతం సుంకాలను భరించక తప్పదని అన్నారు. ఒకటి రెండు నెలల్లో భారత్.. అమెరికాతో తప్పక రాజీ కోసం వెనక్కి వస్తుందని తాను అనుకుంటున్నానన్నారు. ‘వారు ఒకటి లేదా రెండు నెలల్లో చర్చలకు వచ్చి వారు క్షమించండి అని కోరుతారు, డొనాల్డ్ ట్రంప్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తారని నేను భావిస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. అయితే అప్పుడు భారత్‌తో ఎలా వ్యవహరించాలో అన్నది ట్రంప్ నిర్ణయమని తెలిపారు. అమెరికా 50 శాతం సుంకాల నుంచి తప్పించుకోవడానికి అమెరికా వైపు వస్తారో లేదా బ్రిక్స్ ద్వారా చైనా, రష్యాలతో సంబంధాలు పటిష్టం చేసుకుంటారో మోదీ తేల్చుకోవాలని ఆయన అన్నారు.
భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే వారికి (ఇండియన్స్‌కు) మరిన్ని వీసాలు ఇవ్వాల్సి ఉంటుంది. అది మరిచిపోవద్దు. నేనైతే, వారికి వీసాలు కాదు కదా చిల్లిగవ్వ కూడా ఇవ్వను. అమెరికాను కాదనుకొని జిన్‌పింగ్‌తో చేతులు కలిపిన మోదీ ఏం సాధిస్తారో నేనూ చూస్తా.
– ఎక్స్‌లో ఫాక్స్ న్యూస్ హోస్ట్
భారత్‌కు మరిన్ని వీసాలు జారీ చేయాల్సిన అవసరం లేదు. చట్టపరంగా వారికి (ఇండియన్స్) ఇప్పటికే ఇచ్చిన వీసాలతో అమెరికన్ ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. ఇక చాలు. ఇప్పటికే అమెరికా నిండిపోయింది. కొత్తవారు వద్దు. ముందు మనవాళ్లకు ఉద్యోగాలు ఇద్దాం.
– టర్నింగ్ పాయింట్స్ ఎన్జీవో వ్యవస్థాపకుడు, ట్రంప్ మద్దతుదారుడు చార్జీ కిర్క్
భారత్‌కు చెందిన అన్ని కాల్ సెంటర్లపై సుంకాలు విధించండి. అన్ని విదేశీ కాల్ సెంటర్లు, విదేశాల్లో ఉండి అమెరికా కోసం పనిచేసే ఉద్యోగులపై 100 శాతం సుంకాలు విధించండి.
– ట్రంప్ మద్దతుదారుడు జాక్ పోసోబీక్