మధిర, సెప్టెంబర్ 22 : ఖమ్మం జిల్లాలో పెసర కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతు సంఘం నాయకులు అన్నారు. ఈ మేరకు సోమవారం ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చింతకాని మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు, రైతు సంఘం నాయకుడు గురజాల హనుమంతరావు మాట్లాడుతూ.. జిల్లాలోని చింతకాని మండలంలో సుమారు 6 వేల ఎకరాల్లో రైతులు పెసర సాగు చేసినట్లు తెలిపారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో పెసర తడిచిపోయిందన్నారు.
ఈ కారణంగా రైతులకు గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించి రైతుల నుండి పెసర పంటను కొనుగోలు చేయాలన్నారు. మండలంలో రైతాంగం వర్షాల కారణంగా తీవ్రంగా నష్ట పోయారని, రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు యలమద్ది ప్రసాదరావు, పోట్ల అచ్యుతరావు, సీతయ్య, గురిజాల కృష్ణయ్య, జనార్దన్, నన్నక ప్రమోద్, జంపాని లక్ష్మయ్య, బోయిన రామారావు పాల్గొన్నారు.