Harish Rao | నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ మనకు ఎమోషన్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో హరీశ్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ శివారులోని పామాయిల్ ఫ్యాక్టరీలో ఉత్పత్తిని ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వంటేరు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్‌తో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ మనకు ఎమోషన్ అని.. ఈ ఫ్యాక్టరీ వేలాది మంది రైతుల జీవితాల్లో గుణాత్మక మార్పును తీసుకువస్తుందన్నారు. మనం చాలా ఫాక్టరీలు చూస్తుంటామని.. కానీ, ఇది భిన్నమైందన్నారు. ఈ ప్రాంత రైతుల నవశకానికి ఈ ఫ్యాక్టరీ నాంది అని తెలిపారు. గాలిలో తేమ ఎక్కువ ఉన్న చోటనే పామాయిల్ పండుతుందని.. కేసీఆర్ కృషితో రాష్ట్రమంతా పామాయిల్‌కు అనుకూలంగా మారిందన్నారు. ఒక్కసారి పంట వేస్తే 30 సంవత్సరాల వరకు రైతుకు ఆదాయం వస్తుందన్న ఆయన.. ఉద్యోగులకు నెల రోజుకు జీతం వస్తే.. పామాయిల్ రైతులకు 20 రోజులకే డబ్బులు చేతికి అందుతాయన్నారు.
పామాయిల్ ఫ్యాక్టరీ రైతుల జీవితాలకు గేమ్ ఛేంజర్‌లాంటిదని తెలిపారు. 2018లో తేమ తక్కుందని ఆయిల్ పామ్ సాగుకు ఐఐఓపీఆర్ అనుమతి ఇవ్వలేదని, కాళేశ్వరం నీటితో ఎండల్లోనూ చెరువులు, చెక్ డ్యాములు మత్తళ్లు దుంకినయ్ అని.. భూముల్లో తేమశాతం పెరగడంతో ఆయిల్ పామ్‌కు అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయకుండానే ఇదంతా సాధ్యమైందా? అని హరీశ్ ప్రశ్నించారు. ఇక్కడికి నీళ్లొచ్చినా.. ఆయిల్‌పామ్ సాగవుతున్నా అంతా కాళేశ్వరం పుణ్యమేనన్నారు. 2022 జూన్ 5న రామచంద్రాపూర్‌లోని మడుపు ఎల్లారెడ్డి పొలంలో మొదటి మొక్కతో నాంది పలికామని.. అందరినీ బ్రతిమాలి నాదే బాధ్యత అని భరోసా ఇస్తే పామాయిల్ సాగు చేశారని హరీశ్‌రావుకు గుర్తు చేశారు. చుట్టుపక్కల ఐదు జిల్లాల రైతులకు ఈ ఫ్యాక్టరీతో ప్రయోజనం ఉంటుందన్నారు. మొక్కలు నాటి ఆయిల్‌పామ్ సాగు చేసి ఫ్యాక్టరీ పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. అత్యాధునిక టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీని నిర్మించామన్నారు.
ఆ ఫ్యాక్టరీ ప్రారంభించేందుకు కాంగ్రెసోళ్లు జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నారని సెటైర్లు వేశారు. మన ప్రభుత్వం ఉంటే ఏడాది ముందే ఫ్యాక్టరీ ప్రారంభమయ్యేదన్నారు. వంద టన్నుల ఆయిల్ పామ్ గెలలకు 19 టన్నుల పామాయిల్ వస్తుందని హరీశ్‌రావు తెలిపారు. గోద్రెజ్, పతంజలి సహా అనేక కంపెనీల ప్రతినిధులు ఈ ఫ్యాక్టరీని చూసిపోతున్నారన్నారు. రాష్ట్రంలో పది లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పెట్టాలన్నది కేసీఆర్ సంకల్పమని.. రైతును రాజును చేసే పంట ఆయిల్ పామ్ సాగు అని తెలిపారు. ఎకరానికి లక్షన్నర రూపాయలు వచ్చే బంగారం లాంటి పంట ఆయిల్ పామ్ అని.. ఇందులో ఇంతర పంటగా కోకో సాగు చేస్తే మరో లక్ష ఆదాయం వస్తుందన్నారు. ఈ పంటలతో ఎకరానికి ఏడాదికి రూ.2.50లక్షల ఆదాయం వస్తుందని వివరించారు.