Panchayat Secretaries | మెదక్ రూరల్, సెప్టెంబర్ 22 : పారిశుద్ధ్యం లోపించి పల్లెలు అస్తవ్యస్తంగా మారాయి. గ్రామాలలోని ప్రధాన వీధులు మురుగు నీరు నిలిచి ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి అస్తవ్యస్తంగా తయారయ్యాయి. మెదక్ ,హవేలీ ఘనపూర్ మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మురుగు కాలువలు నిండి, రోడ్లపై మురుగు నీరు పారుతోంది. అదేవిధంగా చెత్తాచెదారం ఎక్కడబడితే అక్కడే ఉండిపోయింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు ఇచ్చింది.
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంలో మంజూరు చేసిన ట్రాక్టర్లు సగం కంటే ఎక్కువగా నిరుపయోగంగా మారాయి. కనీసం డీజిల్ పోసేందుకు కూడా డబ్బ లు లేక పంచాయతీ కార్యదర్శులు లబోదిబోమంటున్నారు. ఈగలు, దోమల బెడద ఎక్కువైంది. కనీసం మురుగు కాలువల గుండా బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదు. గ్రామంలోని ప్రధాన వీధులలో రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచి బురదమయంగా మారడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
పంచాయతీల్లో నిధుల కొరత సర్పంచుల పదవీకాలం ముగిసినప్పటి నుంచి కేంద్రం నుంచి నయాపైసా రాలేదు. పల్లెలపై రాష్ట్ర ప్రభుత్వం కనికరించలేదు. కొన్ని నెలలకు సంబంధించిన కేంద్రం నిధులు పెండింగ్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కార్మికుల వేతనాల కోసం కొద్దిపాటి నిధులు సమకూర్చినట్లు సమాచారం. అంతే తప్ప గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం గ్రామ పంచాయితీలకు నిధులు మాత్రం ఇవ్వడం లేదు. ఇక ఇంటి పన్నుల రూపంలో వచ్చిన నిధులపైన పంచాయతీలు ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు చర్చించుకుంటున్నారు.
పంచాయతీ కార్యదర్శులపై భారం..
సర్పంచుల పదవీకాలం పూర్తయిన తర్వాత పల్లెల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై పడింది. గ్రామాల్లో తరుచూ తాగునీటి బోర్లు కాలిపోవడం, పారిశుధ్య పనులు, వాటర్ ప్లాంట్ల మరమ్మతులు, పైపులైన్ల మరమ్మతులు, గేట్వాల్ మార్చడం, ఇలా అనేక పనులు చేయాల్సి వస్తున్నది.
ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించి చేతులు దులుపుకుంది తప్ప పంచాయతీలకు నిధులు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో గ్రామంలోని పలు సమస్యలపై ప్రజల నుంచి ఒత్తిడి పెరగడం, చేసేదేమీ లేక పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి పనులు చేయాల్సి వస్తుంది. ఇలా మండలంలో దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో సెక్రటరీల ఒక్కొక్కరివి రూ.లక్ష నుంచి 3 లక్షల వరకు అప్పులు చేసి పనులు చేయించారు.
బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి..
ఇంకొందరు గ్రామ పెద్దల సహకారంతో కలిసి గ్రామ సమస్యలను పరిష్కరించడానికి నిధులు పెట్టించి పనులు చేస్తున్నట్లు సమాచారం. బదిలీలపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శులు బిల్లు కోసం ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు జీఓ తీసుకురావడంతో కొందరు పంచాయతీ కార్యదర్శులు బదిలీలపై ఇతర పంచాయితీలకు వెళ్లిపోయినా.. తాము ఇదివరకు విధులు నిర్వహించిన పంచాయతీలలో తాము అప్పులు చేసి గ్రామ సమస్యల పరిష్కారానికి చేసిన ఖర్చులకు గాను చేసిన బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని పలువురు సెక్రటరీలు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ ఎన్నికలు వస్తే తమపై ఉన్న ఆర్థిక భారం తగ్గుతోందని కార్యదర్శులు స్పష్టం చేశారు. ఉన్నతాధికారులు గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు.
Nagarjuna Sagar | నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద.. 26 గేట్లు ఎత్తివేత
Tandur | ఇరువైపులా తుమ్మ చెట్లు – ప్రమాదాలకు గురువుతున్న వాహనాదారులు