Beetroot Leaves | బీట్రూట్ను తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. బీట్ రూట్ మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తుంది. బీట్ రూట్‌ను నేరుగా తినవచ్చు లేదా జ్యూస్ రూపంలో అయినా తీసుకోవచ్చు. బీట్ రూట్‌తో కొందరు వంటలు కూడా చేస్తుంటారు. అయితే కేవలం బీట్ రూట్ మాత్రమే కాదు, దీని ఆకులు కూడా మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. బీట్ రూట్‌ను కొన్ని సార్లు మనం ఆకులతో సహా చూసి ఉంటాం. కానీ చాలా మందికి తెలియక ఆకులను తీసేస్తుంటారు. అయితే ఈ ఆకుల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. బీట్ రూట్ ఆకులను కూడా మనం తినవచ్చు. వీటినే బీట్ గ్రీన్స్ అని కూడా పిలుస్తారు. ఇవి అనేక పోషక విలువలను కలిగి ఉంటాయి. బీట్ రూట్ ఆకులను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
బీట్ రూట్ ఆకుల్లో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్త స్రావం జరగకుండా చూస్తుంది. విటమిన్ కె వల్ల ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. ఈ ఆకుల్లో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వీటిల్లో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బీట్ రూట్ లాగే వాటి ఆకుల్లోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనత తగ్గేలా చేస్తుంది. ఈ ఆకుల్లో ఉండే క్యాల్షియం ఎముకలను ఆరోగ్యంగా మారుస్తుంది. బీట్ రూట్ ఆకుల్లోని మెగ్నిషియం కండరాలకు, నాడులకు బలాన్ని అందిస్తుంది. దీని వల్ల కండరాలు ప్రశాంతంగా మారుతాయి. కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. బీట్ రూట్ ఆకుల్లో ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
బీట్ రూట్ ఆకుల్లోనూ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని, వాపులను తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. బీట్ రూట్ ఆకులను తినడం వల్ల లుటీన్, జియాజాంతిన్ అనే పోషకాలు లభిస్తాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కళ్లలో శుక్లాలు ఏర్పడకుండా చూస్తాయి. దీని వల్ల వృద్ధాప్యంలోనూ కళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. బీట్ రూట్ ఆకుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫైబర్ వల్ల మలబద్దకం తగ్గుతుంది. పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
బీట్ రూట్ ఆకులను నేరుగా తినవచ్చు లేదా వండుకుని కూడా తినవచ్చు. ఇవి కాస్త మట్టి రుచి, వాసనను కలిగి ఉంటాయి. కానీ ఈ ఆకులు అద్బుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. బీట్ రూట్ ఆకులను వండేముందు లేదా నేరుగా తినేముందు శుభ్రంగా కడగాల్సి ఉంటుంది. బీట్ రూట్ ఆకుల రుచి కాస్త పాలకూరను పోలి ఉంటుందని చెప్పవచ్చు. బీట్ రూట్ ఆకులను ఇతర కూరగాయలతో కలిపి కూడా వండుకోవచ్చు. సలాడ్స్‌లోనూ వేసి తినవచ్చు. సూప్‌లు, స్మూతీల వంటి వాటిలోనూ వేసి తీసుకోవచ్చు. బీట్ రూట్ ఆకులను 100 గ్రాములు తింటే కేవలం 22 క్యాలరీలే లభిస్తాయి. పిండి పదార్థాలు 4.3 గ్రాములు, ఫైబర్ 3.7 గ్రాములు, ప్రోటీన్లు 2.2 గ్రాములు ఉంటాయి. అలాగే విటమిన్లు కె, ఎ, సిలతోపాటు క్యాల్షియం, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం కూడా అధిక మొత్తాల్లో ఉంటాయి. ఇక బీట్ రూట్ ఆకుల్లో ఆగ్జలేట్స్ అధికంగా ఉంటాయి కనుక కిడ్నీ స్టోన్లు, గాల్ బ్లాడర్ స్టోన్లు ఉన్నవారు ఈ ఆకులను తినకూడదు. ఇలా పలు జాగ్రత్తలను పాటిస్తూ బీట్ రూట్ ఆకులను తింటుటే అనేక లాభాలను పొందవచ్చు.