అశ్వారావుపేట, సెప్టెంబర్ 28 : బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై గ్రామ పంచాయతీలు చేతులెత్తేశాయి. నిధుల కొరత కారణంగా చెరువుల్లో బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లు చేయటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలను నిధుల కొరత వెంటాడుతున్నది. పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోకపోవటంతో గ్రామాల్లో స్థానిక ఆలయ కమిటీలే కొంతవరకు చెరువులను శుభ్రం చేసుకుంటున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 23 మండలాల్లో 471 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మేజర్ గ్రామ పంచాయతీలు మినహా మిగతా గ్రామీణ ప్రాంతాల్లో బతుకమ్మ ఏర్పాట్లు కంటికి కనిపించటం లేదు.
అధికారులు మాత్రం నిధుల కొరత వాస్తవేమని, కానీ తాత్కాలిక ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించినట్లు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. దీంతోపాటు పట్టణాలు, పల్లెల్లో బతుకమ్మ ఉత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. కానీ బతుకమ్మ వేడుకల నిర్వహణ పట్ల పంచాయతీ కార్యదర్శులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా ఎటువంటి నిధులు మంజూరుకాక, గ్రామీణ ప్రాంతాల్లో పన్నులు వసూలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దీంతో బతుకమ్మ ఏర్పాట్లు చేయలేమంటూ ఇప్పటికే ఎక్కువమంది పంచాయతీ కార్యదర్శులు చేతులెత్తేశారు. మండల అధికారులు మాత్రం కనీసం తాత్కాలిక ఏర్పాైట్లెనా చేయాల్సిందేనని ఆదేశిస్తున్నారు. గ్రామ కార్యదర్శులు మాత్రం నిధులు లేక, ఇప్పటికే పంచాయతీ నిర్వహణకు చేసిన అప్పులు పెరిగిపోయి నిస్సాహాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో కార్యదర్శులు గ్రామ పంచాయతీ నిధులను బతుకమ్మ ఏర్పాట్లకు వినియోగించుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎటువంటి నిధులు మంజూరు కాకపోవటంతో నిధులు కొరత తీవ్రంగా ఉంది. గ్రామ పంచాయతీల్లో ఏ చిన్న పని చేయాలన్నా అప్పు చేసి ఖర్చు చేయాల్సిన దుస్థితి ఎదురవుతున్నది. కనీసం అప్పు కూడా పుట్టని పరిస్థితుల్లో ఇప్పుడు బతుకమ్మ ఏర్పాట్లు ఎలా అంటూ మదనపడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్థిక సహకారం అందక దిగాలు చెందుతున్నారు. ఇక చేసేదిఏమీలేక ఎక్కువ మంది గ్రామ కార్యదర్శులు బతుకమ్మ ఏర్పాట్లు చేయలేమంటూ ఖరాఖండీగా తేల్చి చెబుతున్నారు.
గ్రామ పంచాయతీల నిర్వహణ కార్యదర్శులకు ఆర్థిక భారంగా మారాయి. ఇప్పటికే చేసిన అప్పులు తీర్చలేక పెండింగ్ బిల్లులు మంజూరుకాక ఆర్థికంగా నలిగిపోతున్నారు. ఒక్కో కార్యదర్శికి సుమారు రూ.1.50 నుంచి రూ.2 లక్షల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అందుకే బతుకమ్మ ఏర్పాట్లకు అయ్యే ఖర్చులు భరించలేమని వెనుకడుగు వేస్తున్నారు.
బతుకమ్మల నిమజ్జనం కోసం ముందస్తుగా మైదానం, లైటింగ్, చెరువులోకి దిగేందుకు మెట్లు, మ్యాట్లు ఏర్పాటు చేయాలంటే కనీసం రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు అవుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 471 గ్రామ పంచాయతీల్లో 100 మందికి పైగా ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తున్నారు. వీరికైతే గత 6 నెలలుగా వేతనాలు కూడా అందటం లేదు. కుటుంబ పోషణ కష్టంగా మోస్తున్న వీరు ఇక ఖాళీ జేబులతో ఏర్పాట్లు ఎలా చేయాలంటూ పెదవి విరుస్తున్నారు. సర్పంచ్‌లు ఉన్న సమయంలో కొంతవరకు ఖర్చులు వారు చూసుకునే వారు. స్థానిక బలంతో ఎక్కడైనా అప్పుడు తీసుకొచ్చి తర్వాత బిల్లులు మంజూరైన తర్వాత చెల్లించే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు సర్పంచ్‌లు లేక ప్రభుత్వం నుంచి నిధులు రాక కార్యదర్శులు జేబుల్లో నుంచి ఖర్చు చేయాల్సి వస్తున్నది. ప్రభుత్వం నుంచి రెండేళ్లుగా నిధులు మంజూరు కాకపోవటంతో ఇప్పుడు అప్పులు పుట్టే పరిస్థితి కనిపించటం లేదు. ఇదిలా ఉంటే పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు గడిచిన మూడునెలలుగా కార్యదర్శులు వేతనాలు చెల్లించలేని దయనీయ స్థితిలో ఉన్నారు. పండుగ పూట పస్తులు తప్పటం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.