కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 27: బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాకుండా తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని, మహిళల సామాజిక కలయికను ప్రోత్సహించే ఆచారంగా నిలిచిందని జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి వెంకటేశ్వరరావు అన్నారు.
ఆదివారం కలెక్టరేట్ ప్రాంగణంలో అట్టహాసంగా జరిగిన ‘ వెన్నముద్ద బతుకమ్మ’ ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, పూలతో అలంకరించిన గౌరమ్మకు పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలలో భాగంగా ఇంటర్మీడియట్ శాఖ విద్యాశాఖ, ఆధ్వర్యంలో ఈ వేడుకలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన బతుకమ్మ పండుగలో గౌరమ్మకు పూలతో పూజించడం ప్రధాన ప్రత్యేకత అని, ఇతర పండుగల మాదిరి నైవేద్యాలకన్నా పూలనే సమర్పించడం బతుకమ్మకు ప్రత్యేక గుర్తింపును కల్పిస్తుందని పేర్కొన్నారు. పూలను పూజించే మన సంస్కృతి గొప్పదని ఆమె అన్నారు. స్త్రీల ఐక్యత, కుటుంబ సఖ్యతకు ప్రతీకగా నిలిచే వెన్నముద్ద బతుకమ్మలో చిన్నారులు, మహిళల ఉద్యోగులు పాటలు పాడి, ఆటలాడి అందరిని ఉత్సాహపరిచారు.
ఈ వేడుకల్లో జి ఈ సి ఈ ఓ అన్నామని, ప్రభుత్వ జూనియర్ కళాశాల ములకలపల్లి ప్రిన్సిపల్ కల్పన, విద్యాశాఖ అధికారి కార్యాలయం సిబ్బంది, మరియు కస్తూరిబా గాంధీ విద్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.