కాసిపేట, సెప్టెంబర్ 28 : బతుకమ్మ పండుగ వేళ రాత్రిపూట పలు గ్రామాల్లో వీధి దీపాలు (Street Lights) వెలగడం లేదు. ఎంతో ముఖ్యమైన గల సద్దుల బతుకమ్మ సమీపిస్తున్నా.. చాలా కాలనీల్లో వీధి దీపాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ముత్యంపల్లిలో కూడా ఇదే పరిస్థితి.
రెండో వార్డు, ఐదో వార్డులో వీధి దీపాలు లేవని అధికారులకు పలుమార్లు చెప్పినా వారు ఏర్పాటు చేయలేదు. దాంతో మాజీ ఉప సర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు బోయిని తిరుపతి (Boini Tirupati) సొంత ఖర్చులతో ఆదివారం సాయంత్రం పది వీధి దీపాలు ఏర్పాటు చేయించారు. ఏడాది కాలంగా స్తంభాలకు లైట్లు పెట్టడం లేదని, సద్దుల బతుకమ్మ సందర్భంగా అయినా వీధి దీపాలు పెట్టాలని అధికారులను కోరినా వారు పట్టించుకోలేదు. అందుకే.. సొంత ఖర్చులతో వీధి దీపాలు ఏర్పాటు చేసినట్లు తిరుపతి వివరించారు.