– ఎకరాకు రూ.25 వేల నష్ట పరిహారం ఇవ్వాలి
– సీపీఎం, ఏఐకేఎస్ డిమాండ్
ఖమ్మం రూరల్, అక్టోబర్ 21 : అకాల వర్షాలతో పంట నష్ట పోయిన పత్తి రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేశ్, ఏఐకేఎస్ పాలేరు డివిజన్ నాయకుడు ప్రతాపనేని వెంకటేశ్వర్లు అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని ఎం.వెంకటాయపాలెం గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటలను మంగళవారం రైతు సంఘం ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. రైతులు దిగుబడి రాక ఇబ్బందులు పడుతుంటే ప్రకృతి రైతుపై కక్ష కట్టినట్లు పంట చేతికొచ్చే దశలో అధిక వర్షాలు పడటంతో పంట మొత్తం దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 50 వేల రూపాయలు పెట్టుబడి పెడితే కనీసం 20 వేల రూపాయల పంట కూడా చేతికి రాలేదన్నారు. ఎంవీ పాలెం గ్రామానికి చెందిన వేమన వెంకట్రాములు 16 ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తే ఎకరాకు రెండు క్వింటాళ్ల పంట మాత్రమే పండిందని, క్వింటా పత్తి ప్రభుత్వం రూ.7,500 కు కొంటుందని, అయితే తేమ ఉందని రూ.3,500 కే అడుగుతున్నారన్నారు. ఎకరాకు రూ.50 వేల చొప్పున, రూ.8 లక్షల పెట్టుబడి పెట్టినట్లు బాధిత రైతు తీవ్ర నిర్వేదంతో తెలిపాడు.
రైతు సంఘం డివిజన్ నాయకుడు ప్రతాపనేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం రైతులను దోపిడీ చేసే పథకంగా మారిందని విమర్శించారు. బీమా పథకం నుండి ప్రభుత్వం తప్పుకొవడంతో, ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లడంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఉరడి సుదర్శన్ రెడ్డి, చావా నాగేశ్వరరావు, మద్ది వెంకట్ రెడ్డి, ఆయా సంఘాల నాయకులు నండ్ర ప్రసాద్, వడ్లమూడి నాగేశ్వరరావు, పాపిట్ల సత్యనారాయణ, ఏపూరి వర కుమార్ పాల్గొన్నారు.