కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 21 : రవాణా శాఖలో జరుగుతున్న అవినీతిపై ఉన్నతస్థాయి కమిటీ వేసి విచారణ జరిపించాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తగూడెం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రవాణా శాఖలో బస్సులు, లారీలు, ఫిట్నెస్ సర్టిఫికెట్, లైసెన్స్ లు, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ఇలా ప్రతి పనికి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని, దీని కోసం ప్రత్యేక ప్రైవేట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని మరీ ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డీలర్లు, ఏజెంట్లు వసూలు చేసి అధికారులకు డబ్బులు ముట్టచెబుతారని, చెక్ పోస్ట్ ల వద్ద ఇసుక లారీలు, ట్రాక్టర్లు కాసుల వర్షం కురిపిస్తున్నాయని, ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాలకు రేట్ ఫిక్స్ చేసుకుని దందా కొనసాగిస్తున్నారని తెలిపారు.
నియోజకవర్గంలో నాయకులు చెప్పినట్టు ఇసుక లారీలకు, ట్రాక్టర్ లకు, స్కూల్ బస్సులకు రాయితీలు ఇస్తున్నారనేది బహిరంగ రహస్యమన్నారు. ప్రతి ఏటా స్కూల్ బస్సుల ఫిట్ నెస్ సర్టిఫికెట్ జారీ విషయంలో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డీలర్లు, ఏజెంట్లు డబ్బులు వసూలు చేసి అధికారులకు ముట్టచెబుతారని, ఫిర్యాదులు వచ్చినప్పుడు అధికారులు తూతూ మంత్రంగా చెక్ పోస్ట్ లపై దాడులు చేసి చేతులు దులుపుకోవడం కాకుండా వీరి వెనుక ఉన్న సూత్రధారులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. రవాణా శాఖలోని అవినీతి తిమింగలాలు బయటకు రావాలంటే కిందిస్థాయి సిబ్బంది నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు వారి ఆస్తులపై, వారి బినామీల ఆస్తులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బన్నీ, వినయ్, మురళి, కిషన్ పాల్గొన్నారు.