కారేపల్లి, అక్టోబర్ 21 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలంలో మంగళవారం వైరా వ్యవసాయ శాఖ ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా దుకాణాలలోని సరుకు నిల్వలు, అమ్మకాల రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం గోడౌన్లలో ఉన్న ఎరువులకు, పీఓఎస్ మిషిన్లలో ఉన్న స్టాకును తనిఖీ చేశారు. ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని దుకాణదారులను హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో తిరుగుతూ ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు విక్రయించకూడదని అలా ఎవరైనా చేస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అటువంటి వారి గురించి సంబంధిత వ్యవసాయ, పోలీస్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. రైతులు వ్యవసాయ శాఖచే లైసెన్స్ పొందిన దుకాణాలలోనే ఎరువులను కొనుగోలు చేయాలని సూచించారు. ఆమె వెంట ఏఓ బట్టు అశోక్ కుమార్, ఏఈఓలు ఉన్నారు.