కారేపల్లి, అక్టోబర్ 21 : వైద్యం వికటించి మూగ జీవాలు మృత్యువాతకు గురైనట్లు బాధిత రైతులు మంగళవారం ఖమ్మం జిల్లా కారేపల్లి పశు వైద్యశాలలో ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని గిద్దేవారిగూడెం గ్రామానికి చెందిన జరుపల లాల్సింగ్ తన మేక కాలుకు ముల్లు గుచ్చుకోవడంతో కారేపల్లి ప్రభుత్వ పశు వైద్యశాలకు తీసుకొచ్చాడు. వైద్య సిబ్బంది మేకకు ఇంజక్షన్ వేశారు. దీంతో ఇంటికి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత మేక నాలుగు కాళ్లు చచ్చుపడిపోవడంతో తిరిగి కారేపల్లిలోని పశు వైద్యశాలకు తీసుకువెళ్లాడు. అదేవిధంగా కారేపల్లి సంత సమీపంలోని సోమందుల నాగరాజు తన ఇంట్లో పెంచుతున్న పందెం కోడికి పశు వైద్యశాలలో ఇంజక్షన్ చేపించాడు. కొద్దిసేపటికే కోడి మృతి చెందడంతో పశు వైద్యశాలకు తీసుకెళ్లి ప్రాంగణంలో పెట్టి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని వైద్య సిబ్బందికి చెప్పి వెళ్లిపోయాడు.
ఇదిలా ఉండగా ఈ నెల 19న సామ్య తండాలో వాంకుడోత్ రాముకు చెందిన బర్రె దూడకు పశు వైద్య సిబ్బంది నట్టల నివారణ మందులు వేశారు. దాంతో దూడ బలహీన పడడంతో రాము కారేపల్లి ప్రభుత్వ పశు వైద్యశాలకు తీసుకురాగా వైద్య సిబ్బంది మూడు ఇంజక్షన్లు చేయడం వల్ల అదే రోజు రాత్రి మృతి చెందినట్లు బాధిత రైతు రాము తెలిపాడు. ఈ విషయమై మండల పశు వైద్యాధికారి ఉపేందర్ ను నమస్తే తెలంగాణ ఫోన్ లో వివరణ అడగగా వైద్య సిబ్బంది ఇచ్చిన మందులు, ఇంజక్షన్ల వల్ల ఎటువంటి ప్రాణహాని ఉండదన్నారు. వాటికి ఉన్న జబ్బుల కారణంగానే బర్రె దూడ, కోడి మృతి చెందినట్లు తెలిపాడు. ఇంజక్షన్ చేసిన తర్వాత మేకలకు కాళ్లు బలహీన పడడం సాధారణమేనన్నారు. రెండు మూడు రోజుల పాటు మేకను వైద్య సిబ్బంది పరిశీలనలో ఉంచనున్నట్లు చెప్పారు.