గ్వాలియర్ : రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని, అయితే సాగు చట్టాల రద్దు కాకుండా ప్రత్యామ్నాయాలపై చర్చించేందుకు సిద్ధమని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. గతేడాది నవంబర్ నుంచి మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం రైతులతో మాట్లాడిందని, మళ్లీ చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. బిల్లుల రద్దు కాకుండా ఇతర అంశాలపై చర్చించేందుకు రైతు సంఘాలు సిద్ధంగా ఉంటే.. వారితో మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానంలో మరొకరిని నియమిస్తారనే వార్తలను కేంద్రమంత్రి తోసిపుచ్చారు. నాయకత్వంలో ఎలాంటి మార్పులకు అవకాశం లేదని చెప్పారు.