న్యూఢిల్లీ: మరణ శిక్షను అమలు చేయడం కోసం దోషిని ఉరి (Death Penalty) తీయడానికి బదులుగా, నిమిషాల్లో ప్రాణాలను తీసే విధానాలను అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ జరుపుతున్నది. మరణ శిక్షను అమలు చేయవలసిన విధానాన్ని ఎంపిక చేసుకునే అవకాశాన్ని దోషికి ఇవ్వాలని పిటిషనర్ కోరారు.
పిటిషనర్ తరపున అడ్వకేట్ రుషి మల్హోత్రా వాదనలు వినిపిస్తూ, ఉరి తీయడం కన్నా, ప్రాణాంతక ఇంజెక్షన్ మానవీయమైనది, వేగవంతమైనది, మర్యాదపూర్వకమైనది అని తెలిపారు. ఉరి తీయడం క్రూరమైనది, ఆటవికమైనది అని చెప్పారు. కేంద్రం సమర్పించిన కౌంటర్ అఫిడవిట్లో, దోషికి ఇటువంటి అవకాశాలు ఇవ్వడం సాధ్యం కాదని తెలిపింది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, కాలక్రమంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా పరిణామం చెందడానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడమే సమస్య అని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను నవంబరు 11కు వాయిదా వేసింది.