కాంగ్రెస్‌లో అవినీతి రాజకీయం రచ్చకెక్కి రోడ్డునపడ్డది. మంత్రి కొండా సురేఖకు తెలియకుండానే ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్‌ను డిస్మిస్ చేసిన ప్రభుత్వం.. బుధవారం ఆమె ఇంటిమీదికి మఫ్టీలో పోలీసులను పంపింది. సుమంత్ మంత్రి ఇంట్లో ఉన్నారన్న సమాచారం మేరకు.. ఆయనను అరెస్ట్ చేసేందుకు తాము వచ్చామని టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. అయితే అందుకు మంత్రి ఒప్పుకోలేదు.
ఈ సందర్భంగా సురేఖ, ఆమె కుమార్తె సుస్మితా పటేల్.. పోలీసులను గేటువద్దే అడ్డుకుని, వారితో వాగ్వాదానికి దిగారు. తమ ఇంటికి ఎందుకువచ్చారంటూ పోలీసులపై వారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ను అదుపులోకి తీసుకునేందుకు మంత్రి ఇంటిపైకి వచ్చిన పోలీసులపై సురేఖ, ఆమె కూతురు సుస్మిత మండిపడ్డారు. వారిలో మహిళా పోలీసులు కూడా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హైడ్రామా కొనసాగుతుండగానే మాజీ ఓఎస్డీ సుమంత్‌ను తన వెంట కారులో ఎక్కించుకుని కొండా సురేఖ అక్కడినుంచి వెళ్లిపోయారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేఖ వద్ద కాంట్రాక్టు పద్ధతిలో ఓఎస్డీగా పనిచేస్తున్న సుమంత్‌ను పలు ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం విధుల నుంచి తొలగించింది. అయితే మంత్రినైన తనకు సమాచారం ఇవ్వకుండానే సుమంత్‌ను ప్రభుత్వం తొలగించడంపై మంత్రి సురేఖ ఆగ్రహంతో ఉన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉన్న దక్కన్ సిమెంట్ నుంచి డబ్బులు డిమాండ్ చేసేందుకు సుమంత్ గన్‌తో బెదిరించారన్న ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం నుంచే సుమంత్ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో సుమంత్ మంత్రి ఇంట్లో ఉన్నారన్న సమాచారం మేరకు జూబ్లీహిల్స్‌లోని సురేఖ నివాసానికి బుధవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు వచ్చారు. మఫ్టీలో ఉన్న వారిని గేటు వద్దే అడ్డుకున్న మంత్రి సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత.. పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ఇంటికి ఎందుకు వచ్చారంటూ నిలదీశారు. పోలీసులను ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. సురేఖ కూతురు సుస్మిత టాస్క్ఫోర్స్పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ‘ఏమిటిది? ఎక్కడున్నం? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నమా? మరో గవర్నమెంట్లో ఉన్నమా? రాత్రిపూట ఇకడికి ఎందుకువచ్చిండ్రు? ఏమనుకుంటున్నరు? మీకు పర్మిషన్ ఎవరిచ్చిండ్రు? పోలీసులే అయితే మఫ్టీలో ఎందుకొచ్చిండ్రు? ఆయన (సుమంత్) ఏం తప్పు చేసిండని ఇకడికి వచ్చిండ్రు? మీ దగ్గర ఆయన బెదిరించినట్టు ఆధారాలుంటే వీడియోనైనా చూపెట్టండి? రాత్రిపూట మా ఇంటికి పోలీసులను పంపుడు.. ఆ మూలకు, ఈ మూలకు కాపలా పెట్టుడు.. ఏందిది? ఏమనుకుంటున్నరు?’ అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
సుమంత్‌పై వరంగల్‌లో కేసు నమోదైందని పోలీసులు తెలుపగా.. ఎవరు ఫిర్యాదు చేశారంటూ సుస్మిత ప్రశ్నించారు. హుజూర్నగర్ బెదిరింపుల కేసులో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు మేరకే వచ్చామంటూ పోలీసులు తెలుపడంతో.. సురేఖ అక్కడినుంచే ఉత్తమ్‌కు ఫోన్ చేశారు. అయితే తానెలాంటి ఫిర్యాదూ చేయలేదని మంత్రి తెలుపడంతో సురేఖ పోలీసులపై మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి కుమార్తె ముఖ్యమంత్రిని, ఆయన చుట్టూ ఉన్న నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. బీసీలమైన తమపై రెడ్లు అందరూ కలిసి కుట్ర చేస్తున్నారని, తమ కుటుంబంపై పగబట్టారని తీవ్ర విమర్శలు గుప్పించారు. నేరుగా ముఖ్యమంత్రి పేరునే ప్రస్తావిస్తూ ఆరోపణలకు దిగారు. ‘సీఎం చుట్టూ ఉన్న ఫహీమ్ లాంటి నేతల సంగతేంది? వాళ్ల మీద చర్యలు తీసుకోరుకానీ, అమాయకుడైన సుమంత్‌ను అరెస్టు చేసేందుకు వస్తారా?’ అంటూ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి సోదరులపైనా మంత్రి కుమార్తె మండిపడ్డారు. ‘తిరుపతిరెడ్డికి, కొండల్‌రెడ్డికి గన్మెన్లు ఎందుకు ఉన్నారు? వాళ్లు కాంగ్రెస్ పార్టీకి ఏం చేశారని వాళ్లకు గన్మెన్లను ఇచ్చారు? రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి కుట్ర చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి చెప్తేనే రోహిన్‌రెడ్డి సుమంత్‌ను పిలిచాడు. ఆ రోజు ఆయన వెళ్లి వారితో మాట్లాడి వచ్చేశాడు. అంతకుమించి ఏమీ జరగలేదు. ఈ రోజు సుమంత్ మీద తప్పుడు కేసు పెట్టి.. కావాలని వేధిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మా ఇంటి మీదికే వచ్చారు’ అంటూ సుస్మిత మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి తమ కుటుంబంపై ఎందుకు పడ్డాడని ప్రశ్నించారు. తాము బీసీలం కాబట్టే రెడ్లందరూ తమను టార్గెట్ చేశారని ఆరోపణలు చేశారు.
రాత్రి పదిగంటలకు కొండా సురేఖ ఇంటివ ద్ద మొదలైన హైడ్రామా అర్ధరాత్రి వరకు కొనసాగింది. పోలీసులతో వాగ్వాదం కొనసాగుతుండగానే, మీడియా అక్కడికి చేరుకున్నది. మీడియా ముందే సురేఖ కుమార్తె సుస్మిత పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సుమంత్ జోలికొస్తే ఎంతదూరమైనా వెళ్తామని హెచ్చరించారు. సుమంత్ విషయమై తాము చర్చించుకుని గురువారం తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని ఆమె తెలిపారు. ‘ఈ రోజు సుమంత్ మీద కేసుపెట్టి, అర్ధరాత్రి మా ఇంటికి పోలీసులను పంపి.. మా అమ్మను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. లేకపోతే మహిళా పోలీసులనూ వెంట తీసుకురావాల్సిన అవసరమేంది?’ అని సుస్మిత ఆందోళన వ్యక్తంచేశారు. ఆ ఉద్రిక్తత మధ్యలోనే సుమంత్‌ను తన కార్లో ఎక్కించుకుని సురేఖ అక్కడినుంచి వెళ్లిపోయారు. అయి తే సుమంత్‌ను తోడ్కొని అర్ధరాత్రి వేళ.. ఆమె మంత్రి పొన్నం ఇంటికి వెళ్లారని, పొన్నం అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటినుంచి సురేఖ వెనుదిరిగారని సమాచారం.
నెల రోజులుగా వరంగల్ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో కాక పుట్టిస్తున్నాయి. మేడారం పనుల విషయంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటికి, వరంగల్ జిల్లా మంత్రులు సురేఖ, సీతక్క మధ్య విభేదాలు పొడసూపాయి. అయితే పొంగులేటికి తోడుగా సీఎం రంగంలోకి దిగడంతో సీతక్క సైలెంటయ్యారు. కానీ, మంత్రి సురేఖ మాత్రం తన నిరసనను తెలియజేస్తూనే వచ్చారు. దేవాదాయ శాఖ మంత్రినైన తనకు తెలియకుండా టెండర్లు ఎలా ఖరారు చేస్తారంటూ ఆమె తన ఆగ్రహాన్ని బాహాటంగానే వ్యక్తపరిచారు. జిల్లా వ్యవహారాల్లో పొంగులేటి అతిజోక్యంపై విమర్శలు గుప్పించిన సురేఖ.. అధిష్ఠానానికీ ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటనకు, ఆమె దూరంగా ఉన్నారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం వరంగల్ పర్యటనకు వచ్చారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి దశదిన కర్మకు ముఖ్యమంత్రి హాజరైనప్పటికీ, కొండా సురేఖ ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఓరుగల్లు రాజకీయ రచ్చ కొనసాగుతుండగానే.. మంగళవారం సాయంత్రం సురేఖకు సమాచారం ఇవ్వకుండా ఆమె ఓఎస్డీని తొలగించడం, 24గంటలు గడవకముందే ఆరెస్టుకు సిద్ధమవడం.. అదీ ఏకంగా మంత్రి ఇంటిపైకే పోలీసులను పంపడం ఆసక్తికరంగా మారింది.