హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/ బంజారాహిల్స్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : బీహార్‌లో ఓట్ చోరీ అంటూ దేశవ్యాప్తంగా ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న కాంగ్రెస్ చివరకు తెలంగాణలో అదే ఓట్చోరీ అంశంలో అడ్డంగా దొరికిపోయి ముద్దాయిగా నిలిచింది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడికే రెండు బోగస్ సహా మూడు ఓట ర్ కార్డులు ఉన్నాయంటే ఓట్ చోరీపై గొంతెత్తుతున్న కాంగ్రెస్ ఏస్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పరిశీలనలో ఇలాంటి విస్తుపోయే బోగస్ బాగోతాలు అనేకం బయటపడిన నేపథ్యంలో మరింత లోతుగా విచారిస్తే అసలు ఈ ఆపరేషన్ ఓట్‌చోరీకి మూడు నెలల కిందటే బీజం పడినట్టు తెలిసింది. నవీన్యాదవ్ను అభ్యర్థిగా రంగంలోకి దింపాలని ముందుగానే నిర్ణయించుకున్న కాంగ్రెస్ పెద్దలు అన్ని పార్టీల కంటే ముం దుగానే నియోజకవర్గంలో హడావుడి మొదలుపెట్టడం వెనక ఆంతర్యమూ ఇదేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేవంత్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో గట్టెక్కేందుకు ఓట్ చోరీ తప్ప మరో మార్గం లేదన్న నిర్ణయంతోనే నవీన్‌యాదవ్ వేలకొద్దీ బోగస్ ఓట్ల బాగోతానికి తెరలేపారని తెలుస్తున్నది. సదరు బోగస్ ఓటర్లకు ఇక్కడ అడ్రస్ లేకపోవడంతో నవీన్ నేరుగా వారికి ఓటరు ఐడీ కార్డులను పంపిణీ చేసినట్టు విశ్లేషిస్తున్నారు.
బీహార్‌లో కాంగ్రెస్ వేలెత్తి ఓట్చోరీ అంటుంటే తెలంగాణలో నాలుగు వేళ్లు ఆ పార్టీ వైపే చూపుతున్నాయి. ‘ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే’ అన్నట్టు జూబ్లీహిల్స్‌లో హస్తం పార్టీ చేపట్టిన బోగస్ ఓట్ల వ్యవహారాన్ని తేల్చాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా రాహుల్‌గాంధీకే సవాల్ విసిరారు. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను విశ్లేషిస్తూ అధికార కాంగ్రెస్ మూడు నెలల నుంచి పక్కా ప్రణాళికతో బోగస్ ఓట్ల వ్యవహారాన్ని నడిపినట్టుగా కేటీఆర్ రెండు రోజుల కిందట ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో వెల్లడించారు. వాస్తవానికి మాగంటి మరణం తర్వాత ఆరు నెలల్లో ఉప ఎన్నిక వస్తుందని అందరికీ తెలుసు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో అసలు కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యమే లేదు. పైగా అధికారంలో ఉన్నప్పటికీ 2024 పార్లమెంటు ఎన్నికల్లోనూ మహా నగరానికి సంబంధించిన హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంటు స్థానాల్లో ఆ పార్టీని ప్రజలు ఆదరించలేదంటే హస్తం పార్టీ పరిస్థితి అంతంత మా త్రంగానే ఉందనేది అర్థమవుతుంది. దీనికి తోడు హైడ్రా కూల్చివేతలు, పడకేసిన అభివృద్ధి, మూసీ కూల్చివేతలు, రియల్, నిర్మాణ రంగం కుదేలవడం ఇలా అనేక కోణాల్లో రేవంత్ ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంది. దీంతో ఉప ఎన్నికలో గెలవడం అసాధ్యమనే నిర్ణయానికొచ్చి బోగస్ ఓట్లపై దృష్టిసారించినట్టు పరిశీలకులు విశ్లేషిస్తున్నా రు. ఇందుకు అధికార యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందించిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సినీ పరిశ్రమలో పలు యూనియన్ల వ్యవహారంతో నవీన్‌యాదవ్ తండ్రి చిన శ్రీశైలంయాదవ్‌కు ఆది నుంచి సంబంధాలున్నాయి. దీనిని ఆసరాగా చేసుకొని నవీన్ అనేక మందిని రంగంలోకి దింపి బోగస్ ఓట్లు నమోదు చేయించారని బీఆర్ఎస్ వర్గాల పరిశీలనలో తేలింది.
మూడు నెలలుగా పక్కా ప్రణాళికతో వేలాది ఓటర్లను జూబ్లీహిల్స్ జాబితాలో చేర్చిన నవీన్ యాదవ్‌తోపాటు అతడి అనుచరుల పబ్లిసిటీ యావ ఓటు చోరీ వ్యవహారాన్ని రచ్చకెక్కించిందని కాంగ్రెస్ నేతలే కొందరు చెప్తున్నారు. మూడు నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా దరఖాస్తుల ప్రక్రియను పూర్తిచేసిన నవీన్ యాదవ్ టీమ్ అత్యుత్సాహంతో ఈ నెల మొదటి వారంలో యూసుఫ్‌గూడలోని తన పార్టీ కార్యాలయంలో ఓటర్ కార్డులను డౌన్లోడ్ చేసి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇతర ప్రాంతాల్లో ఉండే వ్యక్తులకు స్థానిక చిరునామాలు సమకూర్చి వేలాదిగా తయారు చేసి నా వారిని తమ చేతిలో ఉంచుకోవాలనే లక్ష్యంతో వారిని పిలిపించుకున్నారు. వారికి కార్డులను పంపిణీ చేయడంతోపాటు పోలింగ్ రోజున ఎక్కడ కు రావాలో సూచనలు జారీ చేసినట్టు తెలిసింది. కాగా కార్డుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నవీన్‌యాదవ్ సోషల్ మీడియా అకౌంట్లతోపాటు అతడి అనుచరులు పోస్ట్ చేయడంతో అప్రమత్తమైన ‘నమస్తే తెలంగాణ’ ఈ వ్యవహారంపై సమగ్రమైన వివరాలతో కథనం ప్రచురించడంతో జాతీయ స్థాయిలో కలకలం చెలరేగింది.
ఎన్నికల కమిషన్ నుంచి నేరుగా ఓటర్లకు వెళ్లాల్సిన గుర్తింపు కార్డులను కాంగ్రెస్ నేత చేతికి ఎలా వచ్చాయని నేరుగా రాహుల్‌గాంధీని ప్రశ్నిస్తూ జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి. దీంతో మరుసటి రోజు బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ఎన్నికల కమిషన్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆతర్వాత వ్యవహారం ఎక్కడ బయటికొచ్చి రచ్చ అవుతుందోననే ఉద్దేశంతో అప్పటికప్పుడు శుభం కార్డు వేసేందుకు తప్పని పరిస్థితుల్లో ఎన్నికల అధికారి మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు నవీన్‌యాదవ్ పంపిణీ చేసినట్టుగా ఆధారాలు ఉన్నప్పటికీ సదరు ఎన్నికల అధికారి వాటిని ఫిర్యాదుకు జోడించకపోవడం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నది. పైగా తాను ఈ-కార్డులను పంపిణీ చేసినట్టుగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ స్వయంగా పోలీసులకు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో అసలు ఈ కార్డులు నవీన్ చేతికెలా వచ్చాయి? ఎందుకు వచ్చాయి? ఒక ఓటరు ఈ-కార్డును ఏ హోదాలో నవీన్ పంపిణీ చేస్తారు? ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం కాదా? అనే సందేహాలు ఒక వంతైతే, బోగస్ దందా జరిగిందనేందుకు ఇదే బలమైన ఆధారంగా పలువురు విశ్లేషిస్తున్నారు. నవీన్‌యాదవ్ ఓటరు ఐడీ కార్డుల పంపిణీ అంశం దేశవ్యాప్తంగా సంచలనమైనప్పటికీ ఆస్థాయిలో న మోదైన కేసులో విచారణ వేగవంతంగా, లోతుగా జరగడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
యూసుఫ్‌గూడలోని పార్టీ కార్యాలయంలోనే వేరే ప్రాంతంలోని ఓ మీ సేవా కేంద్రాన్ని ఇక్కడికి తరలించి పెద్ద ఎత్తున బోగస్ ఓట్ల దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేశారని చెప్తున్నారు. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అధికారులు సహకరించి వాటికి ఆమోదం తెలిపారనే ప్రచారం జరుగుతుంది. ఈ తంతు తర్వాత సదరు ఓట్ల కు సంబంధించిన ఐడీ కార్డుల పంపిణీని చేపట్టారు. నిజమైన ఓటర్లయితే ఎలాగూ నియోజకవర్గంలో వారి చిరునామాతో ని వాసాలు ఉంటాయి. దీంతో అధికారులు పోస్టు ద్వారా ఓటరు కార్డులను పంపిస్తా రు. కానీ ఇక్కడ నియోజకవర్గానికి సంబంధంలేని వారు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటరు పేరుపై వారికి తెలియకుండానే ఇక్కడ ఓటు నమోదు చేయించడం, ఒకే వ్యక్తిపై రెండు, మూడు ఓట్లు.. ఇలా పలు మార్గాల్లో బోగస్ దందా కొనసాగింది. ఈ బోగస్ ఓట్లు నమోదైన అపార్టుమెంట్లు, నివాసాలకు పోస్టు ద్వారా అధికారులు ఓటరు కార్డులు పంపితే ఎలాగూ వాళ్లు అక్కడ ఉండనందున జీహెచ్ఎంసీ కార్యాలయానికి వాపస్ వస్తాయి. అలా చేస్తే మొత్తం వ్యవహారం బెడిసికొట్టే అవకాశం ఉందని, గుట్టుగా బోగస్ ఓట్లను నమోదు చే యించిన నవీన్ అండ్ కో ఈ నెల మొదటి వారంలో వాటి పంపిణీ ప్రక్రియను చేపట్టింది.