కరీంనగర్ కార్పొరేషన్/ కరీంనగర్‌రూరల్, ఫిబ్రవరి 3 : రెండేళ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో కరీంనగర్‌ను పూర్తిగా విధ్వంసం చేశారని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. మంగళవారం నగరంలోని 40, 4 డివిజన్లలో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కరీంనగర్ ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ ఏం చేశారని ప్రశ్నించారు. తాను నగరానికి చేసిన అభివృద్ధి కండ్లకు కట్టినట్టు కనబడుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నగరంలో మట్టి కనపడకుండా సీసీ రోడ్లు వేశామని, నగరాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సౌత్ ఇండియాలోనే రెండో కేబుల్ బ్రిడ్జిని మూడేళ్లలో నిర్మించామన్నారు. ఇలాంటి సజీవ సాక్ష్యాలు చూస్తే ఎవరు ముల్లె మూట సర్దుకుని వెళ్లాలో ఒకసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టి రెండేళ్లు పూర్తయినా తీగలగుట్టపల్లిలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు.
కరీంనగర్‌కే గుదిబండగా ఉన్న డంప్ యార్డ్‌ను ఎందుకు తొలగించలేదన్నారు. తాను చేసిన అభివృద్ధిని ఆయన ఖాతాలో వేసుకొని తనకు సవాల్ విసరడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని పేరొన్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో గద్దెనెకిందని, రెండేళ్లలో రాష్ట్రాన్ని ధ్వంసం చేసిందని మండిపడ్డారు. ఇప్పటివరకు రెండు రూపాయల బిళ్ల కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీసుకు రాలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, 40 డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి నలువాల పుష్పలత- రవీందర్, 4వ డివిజన్ అభ్యర్థి బెజ్జంకి అంజయ్య, నాయకులు సుంకిశాల సంపత్‌రావు, కర్ర సూర్యశేఖర్, నాయకులు తిరుపతి, జకని ఉమాపతి, ప్రభాకర్, వీరస్వామి గౌడ్, సుధాకర్, రాజు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.