తనకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన ‘కాంతార’ ఫ్రాంఛైజీ నిర్మాణ సంస్థతో పాటు రెండో భాగంలో హీరోయిన్గా నటించిన రుక్మిణి వసంత్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలను హీరో రిషబ్‌శెట్టి అన్‌ఫాలో చేయడం కన్నడ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయింది. ఈ ఖాతాలతో పాటు తనకు సుదీర్ఘ కాలంగా మిత్రుడిగా ఉన్న దర్శకుడు, నటుడు రాజ్ బి శెట్టి ఇన్‌స్టా ఖాతాను కూడా రిషబ్‌శెట్టి అన్‌ఫాలో చేయడం అందరిని ఆశ్చర్యపరచింది. ‘కాంతార’ టీమ్‌తో రిషబ్‌కు గత కొంతకాలంగా విభేదాలున్నాయని కన్నడనాట వార్తలొస్తున్నాయి. వీటికి బలం చేకూరుస్తూ నిర్మాణ సంస్థతో పాటు చిత్ర కథానాయికను రిషబ్‌శెట్టి అన్‌ఫాలో చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ‘కాంతార’ ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదూర్ ఖాతాను మాత్రం రిషబ్‌శెట్టి ఫాలో అవుతున్నాడు. ఈ నేపథ్యంలో రిషబ్‌శెట్టి అన్‌ఫాలో కాంట్రవర్సీ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు రిషబ్‌శెట్టి కానీ, హోంబలే ఫిల్మ్స్ కానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో ఈ వివాదం వెనక మతలబు ఏమిటోనని నెటిజన్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. రిషబ్‌శెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా ‘జై హనుమాన్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు.