వాషింగ్టన్, మార్చి 28: ఇరాన్‌తో యుద్ధాన్ని అయితే దౌత్యంతో లేదా తీవ్రమైన దాడులతో ముగించాలని అమెరికా భావిస్తున్నట్టు ఉంది. ఆ దేశ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు దీన్ని బలపరుస్తున్నాయి. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగదని, భూతల దాడులు లేకుండానే ఆ దేశాన్ని లొంగదీస్తామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. భూతల బలగాలను దించకుండానే అమెరికా తన లక్ష్యాలని నెరవేర్చుకుంటుందని ఆయన చెప్పారు. అయితే ఆకస్మిక పరిస్థితులు తలెత్తితే సర్దుబాటు చేసుకోవడానికి, గరిష్ఠ అవకాశం కల్పించేందుకు ఆ ప్రాంతానికి కొన్ని బలగాలను పంపుతున్నట్టు ఆయన అంగీకరించారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వాషింగ్టన్ ఆపరేషన్ షెడ్యూల్ ప్రకారం లేదా దానికంటే ముందే ఉందని, యుద్ధాన్ని నెలల్లో కాదు, వారాల్లో ముగించాలని ఆశిస్తోందని పేర్కొన్నారు. హొర్ముజ్ జలసంధి ద్వారా జరిగే వాణిజ్యం కారణంగా యూరోపియన్, ఆసియన్ దేశాలకే ఎక్కువగా ప్రయోజనం చేకూరుతుందని, ఇప్పుడు దాన్ని ఇరాన్ మూసేయడం వల్ల వాటికే ఎక్కువగా నష్టం వాటిలిల్లుతున్నదని అన్నారు. ఈ క్రమంలో ఆ జలసంధి గుండా సాఫీగా వాణిజ్యం జరిగేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఆ దేశాలు కలిసి రావాలని ఆయన కోరారు. కాగా, శనివారం కూడా ఇరాన్, ఇతర దేశాల మధ్య యుద్ధం కొనసాగింది. ఇరాన్ నుంచి తమపై క్షిపణుల దాడి జరిగిందని, వాటిని సమర్థంగా అడ్డుకున్నామని, అనంతరం టెహ్రాన్‌పై ప్రతీకార దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది.
అయితే యెమన్ నుంచి ఒక క్షిపణిని తమపై ప్రయోగించినట్టు గుర్తించామన్నారు. కాగా, తమపై క్షిపణి దాడులు కొనసాగినట్టు యూఏఈ, బహ్రెయిన్ దేశాలు తెలిపాయి. సౌదీ అరేబియాలోని ఒక ఎయిర్‌బేస్‌పై ఇరాన్ శుక్రవారం జరిపిన దాడిలో 12 మంది యూఎస్ మిలిటరీ సైనికులు గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని అమెరికా అధికారులు వెల్లడించారు. డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడులు కొనసాగిస్తూనే ఉందని యూఎస్ తెలిపింది.
ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడు మొజ్తబా ఖమేనీ చనిపోయి ఉంటారని లేదా తీవ్రంగా గాయపడి ఉంటారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్లక్ష్యంగా వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో యుద్ధం నిరాటంకంగా కొనసాగుతున్నందున అమెరికా సైనిక చర్యలు ఇరాన్ నాయకత్వాన్ని సమర్థవంతంగా తుడిచిపెట్టాయని ఆయన నొక్కి చెప్పారు. ఇరాన్ నాయకులు మరణించారు. వారి సుప్రీం నాయకుడు ఇకపై సుప్రీం లీడర్ కాదు. ఆయన చనిపోయారు. ఆయన కుమారుడు కూడా చనిపోయి ఉండవచ్చు. లేదా చాలా విషమ పరిస్థితిలో ఉండవచ్చు. ఎందుకంటే ఆయన(మొజ్తబా) నుండి ఎటువంటి సమాచారం లేదు. నన్ను ఈ రొంపిలోకి లాగవద్దు అని ఆయన అంటుండవచ్చని నేను భావిస్తున్నాను అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
పశ్చిమాసియా యుద్ధం అమెరికాకు, దాని సంప్రదాయ మిత్ర దేశాలకు మధ్య చీలికలను సృష్టించింది. దాంతో ఆ దేశాలు తటస్థంగా ఉండిపోయాయి. వారి మద్దతు లేకపోవడం పశ్చిమ దేశాల అత్యంత ముఖ్యమైన కూటమి అయిన నాటోపై ప్రభావం చూపుతుందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ‘మేము ఎల్లప్పుడూ వారికి అండగా ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు వారి చర్యలను బట్టి చూస్తే, మనం వారికి అండగా ఉండాల్సిన అవసరం లేదనుకుంటా’ అని మయామిలో ట్రంప్ వ్యాఖ్యానించారు.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు శనివారం కూడా కొనసాగాయి. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడంతో వాటి శకలాలు మీదపడి ఖలీఫా ఎకనమిక్ జోన్స్ అబుదాబి(కేజెడ్)లో ఆరుగురు గాయపడ్డారు. ఉదయం గగనతల రక్షన వ్యవస్థలు ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా అడ్డుకున్న తర్వాత వాటి శకలాలు మీదపడి ఐదుగురు భారతీయ పౌరులు, ఒక పాకిస్థాన్ పౌరుడు స్వల్పంగా గాయపడినట్లు అధికారులు చెప్పారు. శనివారం దుబాయ్‌లో అమెరికా సైన్యం దాగి ఉన్న రెండు సైనిక కేంద్రాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది. ఈ కేంద్రాల్లో 500 మందికి పైగా సైనికులు ఉన్నారని, వారంతా గాయపడ్డారని ఐఆర్జీసీ వెల్లడించింది. అయితే ఇరాన్ జరిపిన దాడిలో తమ సైనికులపై ఎలాంటి దాడి జరగలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. కాగా, కువైట్ అంతర్జాతీయ విమనాశ్రయంపై ఇరాన్ పలుసార్లు డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడుల్లో విమానాశ్రయ రాడార్ వ్యవస్థ దెబ్బ తిందని, అయితే ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.
యెమెన్ నుంచి శనివారం ఉదయం క్షిపణులు దూసుకువచ్చినట్టుగా ఇజ్రాయెల్ అధికార వర్గాలు తెలిపాయి. ఆ దేశం నుంచి క్షిపణి దాడి జరగడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నాయి. ఓవైపు ఇరాన్, హెజ్బొల్లా దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. బీర్ షేబాతోపాటు ప్రధాన అణు పరిశోధన కేంద్రంవద్ద మూడు సార్లు సైరన్లు మోగాయి.