ఏమాత్రం అంచనాలు లేకుండా ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న సినిమా ‘మా ఊరి పొలిమేర’. ఈ సినిమా సీక్వెల్ ‘పొలిమేర 2’ థియేట్రికల్‌గా కూడా సత్తా చాటింది. ఈ మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ నుంచి తదుపరి అధ్యాయంగా ‘పొలిమేర 3’ కూడా తెరకెక్కుతున్న విషయం విదితమే. డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో వంశీ నందిపాటి, జాన్వీ నారంగ్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. ఆగస్ట్ 15న అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఇందులో అర్జున్ పోషిస్తున్న ‘విరావి’ పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ఓ పోస్టర్ని విడుదల చేశారు.
ఈ పోస్టర్లో కండలు తిరిగిన చేతిపై పరమశివుని త్రిశూలం, శ్రీమహావిష్ణువు సుదర్శనచక్రం టాటూలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. త్వరలోనే ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. విభిన్నమైన కథ, కథనాలతో ‘పొలిమేర 3’ రూపొందిస్తున్నామని, ఈ మూడో భాగం గత చిత్రాల హద్దులను దాటి మరింత ముందుకు వెళ్లనున్నదని మేకర్స్ తెలిపారు. మిస్టరీ, డార్క్ సూపర్ నేచురల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల, సత్యం రాజేశ్, గెటప్ శ్రీను, బాలాదిత్య, రాకేందు మౌళి కీలకపాత్రధారులు.