కామారెడ్డి, అక్టోబర్ 11 : నకిలీ నోట్లను తయారుచేస్తూ, దేశంలోని వివిధ రాష్ర్టాలకు కొరియర్ ద్వారా సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మండలం శాబ్దిపూర్ గ్రామానికి సిద్ధాగౌడ్ సెప్టెంబర్ 23న పట్టణంలోని ఓ వైన్స్‌లో రెండు 500 రూపాయల నోట్లు ఇచ్చి ఓ విస్కీ ఫుల్ బాటిల్ కొనుగోలు చేశాడు. వైన్సులో పనిచేస్తున్న అఖిల్, చందుకు అనుమానం వచ్చి రూ.500 నోట్లను పరిశీలించగా నకిలీవని గుర్తించి కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు సెప్టెంబర్ 28న సిద్ధాగౌడ్ను అదుపులోకి తీసుకొని విచారించగా..నకిలీ నోట్లు తయారుచేసి దేశం నలుమూలలకు కొరియర్ ద్వారా సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా బాగోతం బయటపడింది.
సిద్ధాగౌడ్ సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో ఆన్లైన్లో ఫేస్బుక్ ఫేక్ కరెన్సీ గ్రూపులు చూసి అందులో ఉన్న ఫోన్ నంబర్లకు ఫోన్‌చేశాడు. దీంతో వెస్ట్ బెంగాల్‌కు చెందిన సౌరవ్ డే అనే వ్యక్తి లైన్లోకి వచ్చి రూ. ఐదు వేలకు రూ.పది వేల నకిలీ నోట్లు పంపుతానని సిద్ధాగౌడ్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. సెప్టెంబర్ 18న సిద్ధాగౌడ్కు 18 నకిలీ నోట్లు కొరియర్ ద్వారా పంపగా..వాటితో మద్యం కొనుగోలు చేశాడు. దీంతో సిద్ధాగౌడ్ నకిలీ నోట్ల వ్యవహారం బయటపడడంతో కామారెడ్డి పోలీసు బృందం.. వెస్ట్ బెంగాల్‌కు వెళ్లి సెప్టెంబర్ 27న సౌరబ్ డేను అదుపులోకి తీసుకున్నది.
అతడిని విచారించగా హరి నారాయణ భగత్‌తో కలిసి నకిలీ నోట్లను బిహార్‌కు చెందిన రషీద్ నుంచి కొరియర్ ద్వారా తెప్పించుకొని సరఫరా చేస్తున్నట్లు తెలిపాడు. దీంతో సౌరవ్ డే, హరి నారాయణ భగత్‌ను కామారెడ్డి కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్, ఎస్సై రాజు తమ బృందంతో బిహార్‌కు వెళ్లి రషీద్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివిన రషీద్ కలర్ కెమికల్ మిక్సింగ్ వాటి మీద మంచి అవగాహన ఉండడంతో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లాల్ జంగ్ డే, చట్టరామ్, బెంగాల్‌కు చెందిన సౌరవ్ డే, హరి నారాయణ భగత్, పండిట్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కరెన్సీ కాట్ని, దివాకర్ చౌదరి, సత్యదేవ్ యాదవ్, శివ శర్మ, మహారాష్ట్రకు చెందిన ప్రమోద్ కాట్రే అందరూ ఓ గ్రూపుగా ఏర్పడి ఫేక్ కరెన్సీని తయారుచేయాలని పథకం వేసుకున్నారని ఎస్పీ వివరించారు.
12 మంది నిందితుల్లో 8 మందిని పట్టుకొని రిమాండ్‌కు పంపించామని, మరో నలుగురిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. వారి నుంచి 3,08,300 రూపాయల నకిలీ నోట్లు, 15,300 ఒరిజినల్, 8,830 రూపాయల ప్రింటెడ్ నోట్స్, బ్రీజా కార్,9 మొబైల్ ఫోన్లు, కంప్యూటర్, సీపీయూ, స్కానర్, ప్రింటర్‌తోపాటు మరిన్ని పరికరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యారెడ్డి, పట్టణ, సదాశివనగర్ సీఐలు నరహరి, సంతోష్, ఎస్సై రాజు, అనిల్, ఉస్మాన్, సిబ్బంది నర్సింగ్ రావు, రంగారావు తదితరులు పాల్గొన్నారు.