తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఆందోళనబాట పట్టారు. వరికి బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ కోటగిరి మండల కేంద్రంలో శనివారం ధర్నా నిర్వహించగా.. భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని రాస్తారోకో చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో వందలాది మంది రైతులు పాల్గొన్నారు.
కోటగిరి, అక్టోబర్ 11: వరి పంటకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన బాట పట్టారు. శనివారం కోటగిరి మండల కేంద్రంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి బోనస్ చెల్లించాలని రైతులు నినాదాలు చేస్తూ, ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా రైతులు మామిడి శ్రీనివాస్, ఏముల నవీన్, తెల్ల రవికుమార్ మాట్లాడుతూ.. రైతులకు చెల్లించాల్సిన బోనస్ ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం వానకాలం పంటల కోత ప్రారంభమైందని, బోనస్‌పై స్పష్టం ఇవ్వాలని కోరారు. రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తేలేదని భీష్మించుకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ గంగాధర్, రుద్రూర్ ఎస్సై సాయన్న సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గత సీజన్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం రైతులకు బోనస్ ఇవ్వకుండా, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంపై రైతులు మండిపడ్డారు.
కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట మూడు కిలోల ధాన్యాన్ని దోపిడీ చేస్తున్నారని రైతులు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తహసీల్దార్ ఇప్పటివరకు ఈ విషయం తన దృష్టికి రాలేదని, వెంటనే పరిష్కరిస్తానని చెప్పారు.బోనస్ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. దీంతో శాంతించిన రైతులు మూడు రోజుల తర్వాత బోనస్‌పై స్పష్టం రాకపోతే మహాధర్నా ఉంటుందని హెచ్చరించారు.
అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాసరావు, తెల్ల రవికుమార్, పుల్లెల మోహన్‌రావు, మోరే కిషన్, సమీర్, గౌతంకుమార్, నజీర్, ఏముల నవీన్, మామిడి శ్రీనివాస్, డాన్ రాజు, అశోక్, ప్రభాకర్, అరవింద్, గంగాప్రసాద్గౌడ్, కప్ప సంతోష్, వాసుబాబు, యార్లగడ్డ సంతోష్, రమణ తదితరులు పాల్గొన్నారు.