విద్యానగర్, అక్టోబర్ 11: వైద్య రంగంలో వస్తున్న నూతన ఒరవడులకు అనుగుణంగా సాంకేతిక, మానవీయ స్పృహతో వైద్య సేవలందించాలని ఫిజీషియన్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్సింహులు సూచించారు. కరీంనగర్‌లోని వీ కన్వెన్షన్‌లో రెండ్రోజులపాటు జరుగనున్న 9వ రాష్ట్ర స్థాయి ఫిజిషియన్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ ప్రారంభం కాగా, ఆయన హాజరై మాట్లాడారు. వైద్యరంగంలో వస్తున్న పలు విప్లవాత్మక మార్పులను ఎప్పటికప్పుడు వైద్యులు అప్‌గ్రేడ్ చేసుకోవాలన్నారు.
ఎండీ చదివిన వారందరూ ఫిజీషియన్ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకోవాలని, అప్పుడే అన్ని సెమినార్లకు హాజరైతే కొత్త కొత్త విషయాలను తెలుసుకోవచ్చని వివరించారు. అనంతరం సీనియర్ వైద్యులు నందిని చటార్జి, రవికీర్తి, ఎంవీ రావు, శ్రీనివాస్‌కుమార్, గోపాల కృష్ణ గోఖలే, నర్సింహాన్, వసంతకుమార్, నాగార్జున మాటూరి ప్రసంగించారు. కాగా, పీజీ విద్యార్థుల కోసం వర్క్‌షాపు, క్విజ్ పోగ్రాం, పేపర్ ప్రజంటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ తిరుపతి రావు, సెక్రటరీ డాక్టర్ విజయ మోహన్ రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ చైతన్య, డాక్టర్ రఘురామన్, డాక్టర్లు సురేశ్, వెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ప్రశాంతి, నవీనతో పాటు 1200 మంది డెలిగేట్స్ పాల్గొన్నారు.
ఎస్‌ఎల్‌ఈ దీర్ఘకాలిక వ్యాధి
ఎస్‌ఎల్‌ఈ (సిస్టమిక్ లూపస్ ఎరిథేమాటోసస్) ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే మన రోగ నిరోధక వ్యవస్థ పొరపాటుగా తన సొంత శరీర కణాలను దాడి చేస్తుంది. దీని ఫలితంగా చర్మం, జాయింట్స్, కిడ్నీలు, మెదడు, హృదయం ఇతర అవయవాలు దెబ్బతింటాయి. ఇది రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. జన్యుపరంగా కుటుంబంలో ఎస్‌ఎల్‌ఈ ఉన్న వారికి ఎక్కువ ప్రమాదం. పర్యావరణం, మందులు, హార్మోన్ల ప్రభావంతో ఈ వ్యాధి రావచ్చు.
– డాక్టర్ నర్సింహులు, ఫిజీషియన్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్
బరువు తగ్గడం కోసం అత్యాధునిక వైద్యం
సెమాగ్లూటైడ్ అనే ఇంజెక్షన్ వారానికి ఒకటి నాలుగేండ్లపాటు తీసుకున్న వారిలో 18 నుంచి 20 శాతం బరువు తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత వ్యాయామం తప్పనిసరి చేయాలి. గతంలో మెడికల్ న్యూట్రిషియన్తో పాటు బెడియాట్రిక్ సర్జరీలు కొన్ని ప్రాణాంతకంగా మారాయి. కానీ, కొత్తగా అందుబాటులోకి వచ్చిన సెమాగ్లూటైడ్ ఇంజిక్షన్తో టైప్-2 డయాబెటిస్ తగ్గడంతో పాటు బరువు తగ్గుతుంది. వీటితోపాటు హృదయ, లివర్ సంబంధిత వ్యాధుల ప్రభావం తగ్గుతుంది. ప్రస్తుతం ఇది ఖరీదైనప్పటికీ రానున్న రోజుల్లో జనరిక్ మందుల దుకాణాల్లో లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైద్యుల సలహాల మేరకు ఇంజెక్షన్‌ను తీసుకోవాలి.
– డాక్టర్ విజయమోహన్‌రెడ్డి, సీనియర్ ఫిజీషియన్
60 ఏండ్లు దాటితే టీకాలు తప్పనిసరి
60 ఏండ్ల పైబడిన వారిలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఇందుకు ఇన్ఫ్లూయింజా వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్, నవంబర్ మధ్య తీసుకుంటే ఫ్లూ వైరస్ నుంచి రక్షణ పొందవచ్చు. ప్రతి ఏడాది కొత్త వర్షన్ వేయాలి. న్యూ మోకాఖల్ వ్యాక్సిన్ ఒకసారి, లేదా రెండు డోస్‌లు ఒక సంవత్సరం గ్యాప్‌తో వేసుకుంటే న్యూమోనియా, సైనసిటిస్, మెనింజటిస్ నుంచి రక్షణ ఉంటుంది. ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారు తప్పనిసరిగా తీసుకోవాలి. టెటనస్ డిప్తీరియా ఫర్టుసిస్ ప్రతి పదేళ్లకోసారి వేసుకుంటే ఇది గాయాల తర్వాత ఇన్పెక్షన్ల నుంచి రక్షణ ఇస్తుంది. ఏ టీకా అయినా వైద్యుల సలహాల మేరకు తీసుకోవాలి.
– డాక్టర్ రఘురామన్, సీనియర్ ఫిజీషియన్
డెంగ్యూలో హెచ్ఎల్హెచ్ ప్రమాదకరం
డెంగ్యూలో హెచ్ఎల్హెచ్ (హెమోఫాగోసైటిక్ లింపోహిస్టియోసైటోసిస్) అనేది చాలా తీవ్రమైన అరుదైన కాంప్లికేషన్. ఇది ఇమ్యూనో సిస్టమ్ నియంత్రణ కోల్పోయి శరీరంలో అధికమైన ఇంప్లామేషన్ జరగడం వల్ల ఏర్పడుతుంది. సాధారణంగా మన రోగ నిరోధక వ్యవస్థ వైరస్‌లను ఎదుర్కొని ఆపుతుంది. కానీ, హెచ్ఎల్హెచ్లో అది నియంత్రణ తప్పుతుంది. శరీరంలోని రక్తకణాలు, కాలేయం, ప్లీహం, ఎముక మజ్జ దెబ్బతినడం ప్రారంభమవుతుంది. జ్వరం ఎక్కువ రోజులు ఉంటే సీరంపెరిటిన్ పరీక్ష చేసి వెంటనే ఫిజీషియన్ సూచనల మేరకు చికిత్స ప్రారంభించాలి. అవసరమైన వారికి స్టెరాయిడ్స్ ఉపయోగించాలి. ఆలస్యంగా గుర్తిస్తే చాలా ప్రమాదకరం. దీనిపై ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి.
– డాక్టర్ ఎంవీరావు, యశోద హాస్పిటల్స్ ఫిజీషియన్
నూతన సాంకేతికతతో వైద్యం అందించాలి
నూతన సాంకేతికతో ప్రజలకు వైద్య సేవలందించాలి. డెంగీ, హెచ్ఐవీ, బీపీ, షుగర్, కార్డియాక్, లివర్ లాంటి వ్యాధులకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. 1990 నుంచి కేవలం సాక్ష్యాలు, అనుభవం మీదనే మందులు ఇచ్చాం. ఇప్పుడు ఏఐ టెక్నాలజీపై మందులు అందుబాటులోకి వస్తున్నాయి. వైద్య విద్యలోనూ చాలా మార్పులు వచ్చాయి. పీజీ కోర్సులో సైతం మూడు నెలల పాటు వివిధ దవాఖానల్లో పని చేయాలనే నిబంధనలు అమల్లోకి తెచ్చి ప్రజలకు వైద్యం కల్పించడం అభినందనీయం.
– డాక్టర్ ఎం రాజారావు, ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్