మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వార్త ఇటీవల జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. ఒక కానిస్టేబుల్ పోస్టుకు 42 మంది పీహెచ్డీ స్కాలర్లు సహా 13,000 మంది దరఖాస్తు చేసుకోవడమే ఆ వార్త సారాంశం. ఈ అంకెలు క్షణకాలం పాటు ఆశ్చర్యం కలిగించినా, ఆ తర్వాత అవి మన మనసుల్లో ముద్రపడిపోతాయి. ఆ అంకెల గురించి తెలుసుకోవాలన్న ఆత్రుత వల్ల కాదు. అది మనకు ఏం చెప్తుందన్న ఉత్సుకత అందుకు కారణం.
మన దేశంలో అత్యంత విద్యావంతులైన పీహెచ్డీ స్కాలర్లు కూడా ప్రాథమిక స్థాయి కొలువుల కోసం లైన్లలో నిల్చుంటున్నారు. ఇది ఏం సూచిస్తున్నది? ఇది దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ లక్షణమా? లేదా విద్య, అవకాశాల మధ్య ఉన్న అసమతుల్యతా? లేదా ప్రభుత్వ ఉద్యోగాల పట్ల మనకున్న శాశ్వత మోజుకు నిదర్శనమా? లేదా భారత శ్రామిక మార్కెట్ గురించి చెప్పలేని ఆందోళనా? అయితే, ఇది ఒక్క మధ్యప్రదేశ్ రాష్ర్టానికే పరిమితం కాదు. రాజస్థాన్‌లో 10 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు 3.7 లక్షల మంది పోటీపడ్డారు. ఏపీలో వేల పోస్టులకు లక్షల మంది పరీక్షలు రాశారు. ఇది పోలీసు శాఖకు మాత్రమే పరిమితం కాలేదు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల 1,846 ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడ్డాయి. స్వీపర్ అయినా కావచ్చు, ఇంజినీర్ అయినా కావచ్చు.. ఆ పో స్టు అర్హతలకు మించినవారు చాలామంది ఎగబడుతున్నారు. ఉద్యోగ భద్రత ఉండే ప్రభుత్వ కొలువు కోసం లక్షల మంది పట్టభద్రులు పోటీపడుతున్నారు.
ఇవి నియామకాల్లో కనిపించే గణాంకాలు మాత్రమే కావు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ తన జనాభా సామర్థ్యాన్ని అర్థవంతమైన ఉపాధిగా మార్చుకోలేకపోతున్నదని చెప్పేందుకు నిదర్శనం. మన దేశంలో ఏటా శ్రామిక జనాభా 90 లక్షల వరకు పెరుగుతున్నది. కానీ, ఆ మేరకు ఉద్యోగ సృష్టి మాత్రం జరగడం లేదు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధిస్తున్నది కానీ, అందుకు తగ్గట్టుగా ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. కొంతవరకు ఉపాధి సృష్టి జరుగుతున్నా, అవన్నీ అసంఘటిత రంగంలోని ఒప్పంద, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలే. ఇలాంటి కొలువుల్లో తక్కువ వేతనాలు వస్తాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
కరోనా మహమ్మారి కాలం ఈ అభద్రతను మరింత పెంచింది. కరోనా తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకున్నప్పటికీ, ఉపాధిరంగం మాత్రం ఇంకా తేరుకోలేదు. నైపుణ్యం ఉన్నవారు (చాలా తక్కువ మంది) టెక్, ఫైనాన్స్ తదితర రంగాల్లో స్థిరపడ్డారు. కానీ, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లలో చాలామందికి ఉపాధి దొరకడం లేదు. లక్షల మంది తమ విద్యార్హతలతో సంబంధం లేని చిన్నచిన్న పనులు చేసుకుంటున్నారు. ఇంకొంతమంది జీవనోపాధి దొరక్క శ్రామికవర్గానికి పూర్తిగా దూరమయ్యారు. ఒకప్పుడు ఉద్యోగ, ఉపాధికి నిచ్చెన లాంటి విద్య.. ఇప్పుడు జీవనోపాధికి గ్యారెంటీ ఇవ్వనిదిగా మారడం బాధాకరం.
పీహెచ్డీ చేసిన వ్యక్తి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎందుకు దరఖాస్తు చేస్తున్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే జీతాన్ని కాదు, ఆ కొలువుకు ఉన్న గుర్తింపును చూడాలి. ప్రైవేటురంగంలో అస్థిరత నేపథ్యంలో దేశంలోని చాలా కుటుంబాలు ఉద్యోగ భద్రత వైపు మొగ్గుచూపుతున్నాయి. గ్రామాలు, చిన్న చిన్న పట్టణాల్లో సర్కారీ నౌకరీ అంటే జీవనోపాధి మాత్రమే కాదు, సమాజంలో గౌరవానికి అదొక చిహ్నం. పెన్షన్ లాంటి సామాజిక రక్షణలు లేకపోవడంతో ప్రైవేటు రంగంపై యువతలో ఆసక్తి తగ్గిపోతున్నది. ఎవరూ వాటిపై మక్కువ చూపడం లేదు.
ఈ నేపథ్యంలో పోలీసు లేదా మున్సిపల్, రెవెన్యూ తదితర శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగమంటే భవిష్యత్ అనిశ్చితిని రూపుమాపే భరోసాలాగా మారిపోయింది.మన దేశంలో విద్యావ్యవస్థల నుంచి బయటికొచ్చే ప్రొడక్ట్‌కు, ఉపాధి మార్కెట్ డిమాండ్‌కు మధ్య నిర్మాణాత్మక అసమతుల్యత ఉంది. గత రెండు దశాబ్దాలుగా ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, సాధారణ డిగ్రీ లాంటి ఉన్నత విద్య కోర్సులు బాగా విస్తృతమయ్యాయి. అయితే, ఇవి మన దేశ ఉపాధిరంగంతో సరితూగడం లేదు. విద్యాసంస్థల్లో బోధించే పాఠ్యాంశాలకు, పరిశ్రమల అవసరాలకు మధ్య పొంతనే ఉండటం లేదు. ఫలితంగా మనం గ్రాడ్యుయేట్ స్థాయి ఉద్యోగాల కంటే వేగంగా గ్రాడ్యుయేట్లను సృష్టిస్తున్నాం. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ గ్రాడ్యుయేట్లకు ఉపాధి చూపలేకపోతున్న మార్కెట్.. వారిని తమ అర్హత కంటే తక్కువ స్థాయి ఉద్యోగాలు చేసేలా మెడలు వంచుతున్నది.
ఈ అసమతుల్యత ఆర్థికపరమైన అంశాలను మించి ప్రభావాన్ని చూపుతున్నది. నిరాశను పెంచుతున్నది. ప్రభుత్వాలపై నమ్మకాన్ని తగ్గించడమే కాకుండా, ద్వేషాన్ని పెంచుతున్నది. ఏఐ, ఆటోమేషన్ మన వ్యవస్థలోకి వేగంగా దూసుకొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త ఉద్యోగాల సృష్టి మాత్రమే కాదు, ఏది సురక్షితమైన ఉపాధి అనేది నిర్వచించడమూ సవాలుగా మారుతున్నది. ఈ నేపథ్యంలో విద్య, పరిశ్రమలకు మధ్య వారధిగా ఉండే స్థిరమైన కార్మిక-మార్కెట్ వ్యూహం భారత్‌కు అవసరం. అత్యంత విషాదకరమైన అంశమేమిటంటే.. అత్యధిక అర్హత, ఉపాధికి సంబంధించిన ఈ కథనం సమీప భవిష్యత్తులోనూ మారకపోవచ్చు. ఒక కానిస్టేబుల్ పోస్టుకు 13 వేల మంది దరఖాస్తు చేయడాన్ని నిరాశ, నిస్పృహగా మనం చూడకూడదు. ఇది జీవనోపాధి, గుర్తింపు కోసం చేస్తున్న పోరాటానికి ప్రతీక. ఈ ఆర్థిక వ్యవస్థలోకి దూరేందుకు పట్టభద్రులైన నిరుద్యోగులు ఇంకా సర్కారీ కొలువుల కోసం దరఖాస్తులు చేసుకుంటూనే ఉన్నారనడానికి తార్కాణం.
(‘డెక్కన్ హెరాల్డ్’ సౌజన్యంతో..)
– శ్రీనాథ్ శ్రీధరన్