సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు మనకు సుపరిచితమే. ఫ్యాషన్, గేమింగ్, ఫిట్నెస్… ఇలా రకరకాల ఇన్ఫ్లూయెన్సర్ల
గురించి వినే ఉంటాం. కానీ వీటన్నింటికీ భిన్నంగా యాంటి ఏజింగ్ ఇన్ఫ్లూయెన్సర్ ఒకరున్నారు. అతని పేరే బ్రియాన్ జాన్సన్. అమెరికాకు చెందిన ఇతను ఓ బిలియనీర్ వ్యాపారవేత్త. జీవనశైలిలో, ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా శరీర వయసును వెనక్కు మళ్లించవచ్చని, తద్వారా జీవనకాలాన్ని పొడిగించవచ్చని నమ్మాడు. అది నిరూపించడం కోసం తన మీద తానే ప్రయోగాలు చేసుకునే ఇతని వయసు నలభై ఎనిమిది కాగా తన చర్మపు వయస్సును 28 ఏండ్లకు, ఊపిరితిత్తుల వయసును ఏకంగా 18 ఏండ్లకు తగ్గించుకోగలిగాడు.
Bryan Jhonson
మన వయసు పెరిగే కొద్దీ శరీరంలోని అవయవాల వయసూ దానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది. వాటి పనితీరులో తేడా వస్తుంటుంది. అయితే ఆయా ప్రధాన అవయవాల వయసును కొన్ని టెక్నిక్స్ ద్వారా వెనక్కి మళ్లించే ప్రాజెక్టును మొదలు పెట్టారు బ్రియాన్ జాన్సన్. దాని పేరే ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్. దీని ద్వారా వాళ్ల క్లయింట్లకు యాంటి ఏజింగ్ ట్రీట్మెంట్లు అందిస్తారు.
అయితే ఈ తరహా ప్రయోగాలు తన మీద తానే చేసుకుంటూ, శరీరం వయసు ప్రభావానికి గురవడం మీద పరిశోధనలు చేస్తూ, దానికి తిరిగి యవ్వనత్వాన్ని ఇచ్చేందుకు దారులు కనిపెడుతూ సాగుతున్నది అతని ప్రయాణం. మనిషి అసలు ఎందుకు ముసలి అవుతాడు, నేను మళ్లీ పద్దెనిమిది సంవత్సరాల యువకుడిలా మారాలంటే ఏం చేయాలి… లాంటి ఆలోచనల నుంచే ఈ ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ పుట్టుకొచ్చింది. ప్రస్తుతం ఇతను ‘డోంట్ డై’అనే ఉద్యమాన్ని నడుపుతున్నాడు.
మనిషి ఎందుకు చనిపోవాలి? సైన్స్‌ని, టెక్నాలజీని వాడుకొని మనిషి దీర్ఘకాలం జీవించవచ్చు కదా, పెద్ద జీవితాన్ని అనుభవించవచ్చు కదా … అనే అంశాలే మూలంగా ఇది ముందుకు వెళుతున్నది. అలా మనిషి ఆయుష్షును పెంచేందుకు ఇతని సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. అయితే తన వయసును తిరిగి తెచ్చుకోవాలన్న (రివర్స్ ఏజింగ్) ఆలోచన అతనికి 2021లో వచ్చింది. సాధారణ మనిషి ఒక సంవత్సరంలో పెరిగే వయసుతో పోల్చుకుంటే అందులో 0.48 శాతం మాత్రమే అతని వయసు పెరిగేలా ఆయన ఈ ప్రయోగాల ద్వారా మార్పు సాధించగలిగారు. అంటే మనకు ఒక సంవత్సరం ఇతనికి ఆరు నెలలే గడిచినట్లు ఉంటుందన్న మాట!
Bryan Jhonson
100 సప్లిమెంట్లు
దీర్ఘజీవనాన్ని ఉద్దేశించి పనిచేస్తున్న బ్రియాన్ జీవనశైలి కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుంది. కేవలం మొక్కల నుంచి వచ్చే బలమైన ఆహారాన్నే తీసుకుంటారు. శరీరంలో వయసు రీత్యా వచ్చే మార్పుల్ని తెలిపే బయో మార్కర్లను రోజూ పరీక్షించుకుంటూ ఉంటారు. క్రమం తప్పకుండా రక్త పరీక్షలు, ఎంఆర్ఐ లాంటి వివిధ పరీక్షలతో పాటు, జీన్ థెరపీ ఇంజెక్షన్లు, రక్త మార్పిడి లాంటి వివిధ చికిత్సలు చేయించుకుంటారు. ప్రతి రోజూ 100కుపైగా విటమిన్, మినరళ్ల సప్లిమెంట్లు వాడతారు. నిత్యం 25 వ్యాయామాలు చేస్తారు.
తెల్లవారుజామున నాలుగున్నరకల్లా నిద్ర లేచి రోజూ రాత్రి ఒకటే టైమ్‌కి పడుకుంటారు. మొత్తం శరీరమంతా ఎల్ఈడీ లైట్ల కాంతి పడేలా లైట్ థెరపీ చేయించుకుంటారు. 30 మంది వైద్య బృందం రోజు వారీగా ఆయన్ను పరీక్షిస్తుంది. ఈ మొత్తానికీ ఏడాదికి ఆయన 2 మిలియన్ డాలర్లు… అంటే మన డబ్బుల్లో 18 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. అయితే వీటి కారణంగా 48 ఏండ్ల వయసున్న ఆయన శరీరంలో ప్రస్తుతం గుండె వయసు 37 సంవత్సరాలు. చర్మం వయసు 28 సంవత్సరాలు కాగా, ఊపిరితిత్తుల సామర్థ్యం 18 ఏండ్ల వయసు వాళ్లలో మాదిరిగా మారిపోయింది.
ఒకప్పుడు తానూ వేళాపాళా లేకుండా తినేవాడిననీ, నిద్రపోయేవాడిననీ… దాని కారణంగా అధిక బరువు కూడా ఉండేవాడిననీ చెప్పుకుంటారాయన. ఒకరోజు మాత్రం తనకు తానే ఆలోచించుకొని, ఆ జీవనశైలి నుంచి బయటపడ్డాననీ చెబుతారు. ఆ మధ్య జెరోదా సీఈఓ నిఖిల్ కామత్ అతన్ని ఇండియాకు ఇంటర్వ్యూకు పిలిచాడు. అయితే ఇక్కడ కాలుష్యం చాలా ఎక్కువ ఉందంటూ, తాను ఇక్కడ ఉండటం ఆరోగ్యానికి అంత మంచి విషయం కాదని చెబుతూ బ్రియాన్ మధ్యలోనే వెళ్లిపోయాడు.
ఇక్కడికి వచ్చేటప్పుడు ఆక్సిజన్ మాస్క్‌ను ధరించే వచ్చారు. అతని ఆహారాన్ని కూడా అమెరికా నుంచే వెంట తెచ్చుకున్నారు. వినేందుకు సినిమాల్లోలా విచిత్రంగా అనిపించినా… ఇవన్నీ అచ్చమైన నిజాలు. డోంట్ డై మూమెంట్‌ను విస్తరించేందుకు దాని మీదే తాను ప్రస్తుతం మరింత శ్రద్ధ పెడుతున్నట్టు చెబుతున్న బ్రియాన్ మానవాళికి ఎలాంటి కానుక ఇవ్వబోతున్నారో వేచి చూడాల్సిందే!
Bryan Jhonson