హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ప్రాంగణంలో అత్యాధునిక హంగులతో ఆధునీకరించిన శాసనమండలిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అనంతరం మండలిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 1905లో నిర్మితమైన ఈ హాల్‌ను రాజస్థాన్, పర్షియన్ శైలి కళలతో నిర్మించగా, ప్రస్తుతం కొత్త హంగులతో ముస్తాబు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, శాసనమండలి ఒకే ప్రాంగణంలో పనిచేసేవి. ఆ తర్వాత ఈ రెండు సభలు వేర్వేరు భవనాల్లో నిర్వహిస్తూ వచ్చారు. ఈ క్రమంలో శాసన కార్యకలాపాలు ఒకే ప్రాంతంలో ఉండాలనే లక్ష్యంతో తిరిగి దీనిని ఆధునీకరించారు.