గద్వాల, మార్చి 8 : ఇందిరమ్మ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గత రెండేళ్ల్లుగా ఇందిరమ్మ ఇంటి పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. దీంతో జిల్లాలో ఇందిరమ్మ ఇంటి పథక నిర్మాణాలు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. కొంత మేర ఆర్థిక స్థోమత ఉన్న వారు ఇంటి నిర్మాణాలు చేపట్టిన వారి ఖాతాల్లో అనుకున్న సమయంలో బిల్లులు పడకపోవడంతో లబ్ధిదారులు ఎందుకు ఇంటి నిర్మాణం చేపట్టామని ఆందోళన చెందుతున్నారు.
లబ్ధిదారులు సొంతింటి కల నెరవేర్చుకోవాలనే ఆలోచనతో ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించుకున్న ప్రభుత్వం అవసరమైన సమయంలో నిధులు విడుదల చేయకపోవడంతో నిర్మాణ సామగ్రి ధరలు పెరిగి పోతుండండతో ఇండ్ల నిర్మాణంలో ఆశించినంత మేర పురోగతి కనిపించడం లేదు. ఇప్పటికే ఇంటి పత్రాలు పొందిన వారు ఆర్థిక కారణాల వల్ల ఇళ్లు నిర్మించుకోలేమని మంజూరైన ఇంటి పత్రాలు స్వయంగా రద్దు చేసుకున్న వారు అధికారుల లెక్కల ప్రకారం 310 మంది ఉన్నారు. బిల్లుల ఆలస్యం ఓ వైపు పెరిగిన సామగ్రి ధరల కారణంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలపై లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు.
జిల్లాకు 7వేల ఇండ్లు మంజూరు..
ప్రభుత్వం జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వా ల, అలంపూర్ నియోజకవర్గాలకు సంబంధించి 7వేల ఇండ్లు కేటాయించింది. ఇందులో అధికారుల విచారణ అనంతరం అర్హత పొందిన వారు 6,348 లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో ఇప్పటి వరకు 674 ఇండ్లకు మార్కింగ్ కాలేదు. నిర్మాణాలు ప్రారంభమైన ఇండ్లు 5,362 కాగా ఇందులో బీఎల్ స్టేజీలోనే 1450 ఇండ్లు ఉన్నాయి. మిగతా 3,238 ఇండ్లు వివిధ దశలో ఉన్నాయి. ఈ రెండేళ్లలో జిల్లాలో లబ్ధిదారులు పూర్తి చేసుకున్న ఇండ్లు 113 మాత్రమే.
అయితే లబ్ధిదారులు ఇండ్లు నిర్మించుకోవడానికి మన ఇసుక మన వాహనం ద్వారా ఇసుక సరఫరా చేయాల్సి ఉన్నా.. ఇక్కడ ఉన్న రాజకీయ ఆదిపత్య పోరు కారణంగా లబ్ధిదారులకు సరైనా సమయంలో ఇసుక సరఫరా కాకపోవడంతో వారు ఎక్కువ ధరలు చెల్లించి ఇసుక సరఫరా చేసుకుంటున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. జిల్లాలో మూడునెలలుగా ఇం డ్ల నిర్మాణాలు చేపట్టని వారికి అధికారులు నోటీసులు పంపిస్తున్నారు. అధికారులు పంపిన నోటీసుల్లో ఈనెల 31వ తేదీలోగా నిర్మాణాలు చేపట్టాలని లేదంటే మరొకరికి అవకాశం ఇవ్వాలని అధికారులు భావిస్తుండడంతో ఇళ్లు మంజూరైనా ఆర్థిక స్థోమత లేని కారణంగా తాము ఇళ్లు నిర్మించుకోకపోవడం వల్ల ఇళ్లు రద్దు అవుతున్నాయని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
రూ.3కోట్ల పెండింగ్ బిల్లులు
లబ్ధిదారులు ఇంటి పనులు ప్రారంభించి బీఎల్ స్టేజీ, ఇతర దశలో ఇండ్లనిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి సకాలంలో బిల్లులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో లబ్ధిదారులకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.3కోట్ల బిల్లులు పెండింగ్లో ఉంచింది. లబ్ధిదారులు బీఎల్ పూర్తిచేసి గోడలు, స్లాబ్ వరకు నిర్మాణాలు చేపట్టిన వారికి బిల్లులు రాకపోవడంతో వాటి కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.