– అప్పులు చెల్లించమని రైతులపై బ్యాంకర్ల ఒత్తిడి
– లో వోల్టేజితో కాలుతున్న మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు
– పిఓఎల్ రద్దు చేయడం దురదృష్టకరం
– తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన
– ముఖ్య నాయకులతో కలిసి ఆర్డీఓకు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వినతి
కోదాడ, ఆగస్టు 04 : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టివేయబడుతుందని, ఎన్నికల్లో రైతులకు అండగా ఉంటామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతులను దగా చేస్తుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ ముఖ్య నాయకులతో కలిసి ఆర్డీఓ సూర్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట సాగు ప్రారంభ దశలో రైతులకు అవసరమైన క్రాప్ లోన్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందన్నారు. గతంలో ప్రతి ఏడాది రైతులు పంట రుణాలను సులభంగా రెన్యువల్ చేసుకునేవారని ప్రస్తుతం బ్యాంకులో పాత రుణ మొత్తం అసలు, వడ్డీతో సహా చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని రైతులను తీవ్రంగా వేధిస్తున్నారన్నారు. బ్యాంకులపై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడం వల్ల రైతులు మళ్లీ ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు.
ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ హామీని నిలబెట్టుకోలేదని, లో వోల్టేజీతో మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని, సకాలంలో నీరందకపోతే పంటలు ఎండిపోవడం ఖాయమని ప్రభుత్వం ప్రకటనలకు మాత్రమే పరిమితమైందన్నారు. మార్క్ ఫెడ్ ద్వారా ఎరువుల రవాణాకిచ్చే ప్రైవేట్ ఆన్ లారీ (ఎఫ్ ఓ ఎల్) రాయితీని ప్రభుత్వం రద్దు చేయడం దురదృష్టకరమన్నారు. ఈ నిర్ణయంతో పీఏసీఎస్‌లు, డీలర్లు అదనపు రవాణా ఖర్చులు భరించాల్సి వస్తుందని ఈ భారం రైతుల పైనే పడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎరువుల కొరత ఏర్పడి బ్లాక్ మార్కెట్ పెరిగే ప్రమాదం ఉందన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నర్సిరెడ్డి, ఎస్.కె నయీమ్, చీమ నరేష్, కె.బాబు, తుమ్మలపల్లి భాస్కర్, ఉపేందర్ గౌడ్, గొర్రె రాజేష్, చీమ శ్రీనివాస్, గట్ల కోటేశ్వరరావు, కరీముల్లా, బాబా, చలిగంటి వెంకట్, మండల పార్టీ బాధ్యులు, పట్టణ నాయకులు పాల్గొన్నారు.