Vijay | తమిళ సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకులుగా దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అజిత్ కుమార్, విజయ్ చాలా కాలం తర్వాత ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులకు ఊహించని సర్ప్రైజ్గా మారింది. సినిమాల పరంగా ఎన్నోసార్లు పోటీ పడిన ఈ ఇద్దరు హీరోలు.. ఈసారి మాత్రం సినిమా సెట్లో కాదు, అంతర్జాతీయ మోటార్ రేసింగ్ వేదికపై కలిసి కనిపించారు. దీంతో అజిత్, విజయ్ అభిమానుల్లో సందడి నెలకొంది. బ్రిటన్‌లోని ప్రతిష్టాత్మక సిల్వర్‌స్టోన్ మోటార్ రేసింగ్ సర్క్యూట్ ఈ అరుదైన కలయికకు వేదికగా నిలిచింది. అంతర్జాతీయ స్థాయి రేసింగ్ పోటీలో అజిత్ తన రేసింగ్ బృందంతో పాల్గొనగా.. విజయ్ అక్కడ ప్రత్యేక అతిథిగా హాజరై రేసును ప్రారంభించడం ఇప్పుడు సినీ, క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రేసింగ్‌పై అజిత్ కుమార్‌కు ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో పాటు మోటార్ స్పోర్ట్స్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఈసారి అంతర్జాతీయ వేదికపై తన టీమ్‌తో బరిలోకి దిగారు.ఈ పోటీలో విజయ్ స్వయంగా పాల్గొనకపోయినా.. అజిత్ రేసింగ్‌కు మద్దతుగా అక్కడికి రావడం అభిమానులను ఆకట్టుకుంది. ముఖ్యంగా రేసును ప్రారంభించే అవకాశం విజయ్‌కు దక్కడం ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. రేసింగ్ దుస్తుల్లో అజిత్, మరోవైపు గౌరవప్రదమైన హోదాలో విజయ్ ఒకే చోట కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అజిత్, విజయ్ అభిమానుల మధ్య కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో కనిపించే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరి సినిమాలు విడుదలైన ప్రతిసారీ అభిమానుల మధ్య పోటీ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది.
అయితే తమ అభిమాన హీరోల మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవనే విషయాన్ని ఈ అరుదైన కలయిక మరోసారి చూపించినట్టయింది. ఇద్దరూ ఒకే వేదికపై స్నేహపూర్వకంగా కనిపించడంతో అభిమానులు కూడా ఈ క్షణాలను ఆస్వాదిస్తున్నారు.ముఖ్యంగా అజిత్ రేసింగ్ ఈవెంట్‌కు విజయ్ రావడం, ఇద్దరూ పక్కపక్కనే నిలబడి మాట్లాడుకోవడం వంటి దృశ్యాలు అభిమానులకు ప్రత్యేక అనుభూతిని కలిగించాయి. ఇదే కార్యక్రమంలో మరో ఆసక్తికరమైన దృశ్యం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. విజయ్ పక్కనే త్రిష కనిపించడంతో వీరిద్దరికి సంబంధించిన పాత ప్రచారాలు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు వచ్చాయి.అయితే త్రిష ప్రస్తుతం లండన్‌లో తన సినిమా షూటింగ్లో భాగంగా ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో విజయ్ కూడా లండన్‌లో ఉండటంతో అజిత్ రేసింగ్ ఈవెంట్‌కు ఆమె హాజరైనట్లు తెలుస్తోంది.