న్యూఢిల్లీ: బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో శనివారం భేటీ అయిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.. ‘ఇరు దేశాలు ఒకరి బలాల నుంచి మరొకరు పూర్తిగా నేర్చుకోవచ్చని, పరస్పరం మద్దతు ఇచ్చుకోవచ్చని’ అన్నారు. ఏడేండ్ల తర్వాత తొలిసారి భారత్‌కు వచ్చిన జిన్‌పింగ్.. ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. ‘నా పుట్టిన రోజున మీ దేశానికి రావాల్సిందిగా నాకు ఆహ్వానం అందింది. మనం 21 సార్లు కలుసుకున్నాం. పలు అంశాలలో ఏకాభిప్రాయానికి వచ్చాం. అవి చైనా-భారత్ సంబంధాలను స్థిరమైన అభివృద్ధి మార్గంలోకి నడిపించాయి’ అని మోదీతో జిన్‌పింగ్ అన్నారు. ‘చైనా ఎప్పుడూ భారత్‌తో తన సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూసింది. మన రెండు దేశాల జాతీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ, ఒకరి బలాల నుంచి మరొకరం నేర్చుకోవచ్చు.
కలిసి విజయాన్ని సాధించవచ్చు. అని అన్నారు. ‘శతాబ్దంలో ఎన్నడూ చూడని మార్పులు, ఊహకందని మహమ్మారి పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో.. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలుగా, గ్లోబల్ సౌత్‌లోని ముఖ్యమైన సభ్యులుగా చైనా, భారత్‌లు గణనీయమైన బాధ్యతలను భుజాన మోస్తున్నాయి.ప్రజల సంక్షేమంపై శ్రద్ధ వహిస్తూ, ప్రధాన దేశాలుగా తమ పాత్రను పోషించేందుకు కలిసి పనిచేయాలి. సమానత్వం, క్రమబద్ధతతో కూడిన ప్రపంచాన్ని మనం సమర్థించాలి. మన స్వప్రయోజనాలను ప్రైవేటీకరించకూడదు. ప్రపంచ శాంతి, స్థిరత్వం, అభివృద్ధి, సుసంపన్నతకు మరింత సానుకూల శక్తిని అందించాలి’ అని జిన్‌పింగ్ పేర్కొన్నారు.