Sircilla | సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 12: సంతకాలు ఫోర్జరీ చేసి.. తప్పుడు పత్రాలు సృష్టించి.. తమకు తెలియకుండానే కళాశాలను ఇతరులకు విక్రయించారంటూ సిరిసిల్లలోని శ్రీకృష్ణదేవరాయ జూనియర్ కళాశాల నిర్వాహకుడు దిడ్డి శ్రీనివాస్ పోలీసులను ఆశ్రయించారు. సొసైటీ సభ్యుల పత్రాల్లో మార్పులు చేసి తనతో పాటు తన భార్య సంతకాలను ఫోర్జరీ చేసినట్లు ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు.
సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దిడ్డి శ్రీనివాస్ ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. కళాశాల విక్రయంపై 2026 మే 27న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
సిరిసిల్ల వెంకంపేటకు చెందిన దిడ్డి శ్రీనివాస్ లెక్చరర్‌గా, వికాస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. తాను మరికొందరితో కలిసి రాజరాజేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ (రిజిస్ట్రేషన్ నంబర్ 250/2001) ఆధ్వర్యంలో అనంతనగర్‌లో నిర్వహిస్తున్న పద్మశ్రీ జూనియర్ కళాశాలను 2004లో కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం దాని పేరును శ్రీకృష్ణదేవరాయ జూనియర్ కళాశాలగా మార్చి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సొసైటీకి తాను అధ్యక్షుడిగా, ఏ. శంకర్రావు ఉపాధ్యక్షుడిగా, గుగ్గిళ్ల జగన్‌గౌడ్ ప్రధాన కార్యదర్శిగా, గుగ్గిళ్ల శ్రీనివాస్ సహాయ కార్యదర్శిగా, గుగ్గిళ్ల శైలజ కోశాధికారిగా, ఏ. ప్రణిత, తన భార్య దిడ్డి రమ సభ్యులుగా ఉన్నారని తెలిపారు.
కళాశాలకు సంబంధించిన లెక్కలు, వ్యవహారాల వివరాలు చూపించాలని 2024 ఏప్రిల్ 18 నుంచి ప్రధాన కార్యదర్శి గుగ్గిళ్ల జగన్గౌడ్ను కోరుతున్నప్పటికీ సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేస్తూ వచ్చారని శ్రీనివాస్ ఆరోపించారు. ఇతర సొసైటీ సభ్యులను ప్రశ్నించినా తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించారని తెలిపారు. దీంతో అనుమానం వచ్చి ఆరా తీయగా కళాశాలను ఇప్పటికే విక్రయించినట్లు తెలిసిందని పేర్కొన్నారు. తాను, తన భార్య దిడ్డి రమ కలిసి వెళ్లి ప్రశ్నించగా.. కళాశాలను విక్రయించామని, తాము ఏం చేసుకుంటామో చేసుకోవచ్చంటూ సమాధానం ఇచ్చారని శ్రీనివాస్ ఆరోపించారు.
కళాశాలను విక్రయించే విషయంలో సొసైటీ అధ్యక్షుడిగా తనకు, సభ్యురాలిగా ఉన్న తన భార్యకు తెలియకుండా ఎలా నిర్ణయం తీసుకున్నారనే ప్రశ్నకు సరైన సమాధానం రాలేదని శ్రీనివాస్ తెలిపారు. ఈ వ్యవహారంపై 2024 డిసెంబర్ 10న ఇంటర్మీడియట్ బోర్డును సంప్రదించి పత్రాలను పరిశీలించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. 2023 డిసెంబర్ 1న తమకు తెలియకుండా జనరల్ బాడీ సమావేశం నిర్వహించినట్లు చూపించడంతో పాటు, సొసైటీ పత్రాల్లో సభ్యుల పేజీని మార్చి, తనతో పాటు తన భార్య దిడ్డి రమ సంతకాలను ఫోర్జరీ చేసి తప్పుడు పత్రాలు రూపొందించినట్లు గుర్తించామని ఫిర్యాదులో ఆరోపించారు.
ఆ తప్పుడు పత్రాలను ఆధారంగా చేసుకుని కళాశాలను ఇతరులకు బదలాయించారని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.
కళాశాల స్థలం, దానికి సంబంధించిన పత్రాలు, హక్కులు, లావాదేవీల విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై అందిన ఫిర్యాదుతో సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల పత్రాల ప్రకారం 2026 ఆగస్టు 27న రాత్రి 7 గంటలకు క్రైమ్ నంబర్ 298/2026గా కేసు నమోదైంది. బీఎన్ఎస్ సెక్షన్లు 318(4), 336(3), 340(2), 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న పత్రాలు, లావాదేవీలు, హక్కులకు సంబంధించిన అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎవరెవరి పాత్ర ఉంది? పత్రాలు నిజమైనవేనా? సంతకాలు ఫోర్జరీ చేశారా? కళాశాల బదలాయింపు ఏ విధంగా జరిగింది? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. సంబంధిత వ్యక్తుల నుంచి వివరాలు సేకరించి, పత్రాలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
తమకు తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో కళాశాల విక్రయానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్న గుగ్గిళ్ల జగన్గౌడ్పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని దిడ్డి శ్రీనివాస్ పోలీసులను కోరారు.