Bigg Boss 10 | బిగ్ బాస్ ఇంట్లో వారం రోజులుగా జరిగిన గొడవలు, వివాదాలకు శనివారం నాగార్జున తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రోహిత్–త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం, షాలినీపై రాంప్రసాద్ చేసిన వ్యాఖ్యలు, అలాగే చైత్రను బాధపెట్టేలా షాలినీ సంగీతం ప్లే చేయమని అడిగిన వ్యవహారం వంటి అంశాలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ కంటెస్టెంట్లకు క్లారిటీ ఇచ్చారు. తప్పు ఎవరిదైనా సరే.. ఇంట్లో ప్రతి ఒక్కరూ తమ మాటలు, ప్రవర్తన విషయంలో హద్దులు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ముందుగా మిడ్ వీక్‌లో ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడంపై ఇంట్లో, బయట జరుగుతున్న చర్చకు నాగార్జున సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. చరణ్, చైత్రా రాయ్‌లు నిజంగానే ఎలిమినేట్ అయ్యారా? లేక రహస్య గదిలో ఉన్నారా? అనే అనుమానాలు ప్రేక్షకుల్లో ఉన్న విషయం తెలిసిందే.
అయితే వారిద్దరూ ప్రస్తుతం తమ తమ ఇళ్లలోనే ఉన్నారని కంటెస్టెంట్లకు చూపించారు. వీడియో కాల్ ద్వారా చరణ్, చైత్రా రాయ్‌లతో మాట్లాడించారు. దీంతో ఇంటి సభ్యులకు ఒక క్లారిటీ వచ్చినట్లుగా కనిపించింది. అయితే బయట ప్రేక్షకుల్లో మాత్రం ఈ వ్యవహారంపై ఇంకా అనుమానాలు కొనసాగుతున్నాయి. వీడియో కాల్ వెనుక కనిపించిన నేపథ్యం సెట్‌లా ఉందని, హోటల్ తరహాలో ఉందని కొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మొదటి వారంలోనే హౌస్‌మేట్స్‌గా మారిన రోహిత్, వంశీ, రాంప్రసాద్‌లకు నాగార్జున మిల్క్ షేక్ పంపించారు. ముగ్గురూ తాగిన తర్వాత వారి గ్లాసులను నాగార్జున స్వయంగా కడుగుతూ రోహిత్‌కు ఒక కీలకమైన విషయం చెప్పారు.
ఇంట్లో ఏ పని చిన్నది, పెద్దది అంటూ తేడా చూపించకూడదని స్పష్టం చేశారు. బిగ్ బాస్ ఇంట్లో ప్రతి పనికీ సమానమైన ప్రాధాన్యత ఉంటుందని, హౌస్మేట్స్ అందరూ అవసరమైన పనులు చేయాల్సిందేనని చెప్పారు. ఈ సందర్భంగా రోహిత్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించి, అతడి మాటలు సరైనవేనా అని మిగతా కంటెస్టెంట్ల అభిప్రాయాన్ని అడిగారు. రోహిత్ చేసిన వ్యాఖ్యల విషయంలో శాలినీ అతడిని పూర్తిగా తప్పుబట్టలేదు. రోహిత్ ఉద్దేశం తప్పు కాకపోయినా.. ఉపయోగించిన పదాలు మాత్రం సరైనవి కావని ఆమె అభిప్రాయపడింది. దీంతో నాగార్జున రోహిత్ మాట్లాడిన సందర్భానికి సంబంధించిన వీడియోను ఇంటి సభ్యులకు చూపించారు. అనంతరం షాలినీకి ఓ బాధ్యత అప్పగించారు. స్టోర్ రూమ్ నుంచి ఎంగిలి గ్లాసులు తీసుకొచ్చి.. వాటిని రోహిత్‌తో కడిగించే బాధ్యత షాలినీదేనని చెప్పారు. ఈ విధంగా ఇంట్లో పనులను ఎవరూ తక్కువగా చూడకూడదనే విషయాన్ని నాగ్ స్పష్టంగా తెలియజేశారు.
ఇక రోహిత్‌తో జరిగిన గొడవలో త్రిగుణ్ ఉపయోగించిన కొన్ని పదాలపై నాగార్జున తీవ్రంగా స్పందించారు. ‘స్టెరాయిడ్స్’, ‘డొల్ల రాజా’, ‘పిల్ల బచ్చా’ వంటి పదాలను ఉపయోగించడం సరికాదని మందలించారు.ముఖ్యంగా షాలినీ ఏడ్చిన సమయంలో ఆమెను ఓదార్చి, చైత్రతో సారీ చెప్పించిన త్రిగుణ్.. ఆ తర్వాత తన మాటలతో మళ్లీ పరిస్థితిని దిగజార్చుకున్నాడని నాగ్ వ్యాఖ్యానించారు. దీంతో త్రిగుణ్ రోహిత్‌కు క్షమాపణలు చెప్పాడు. అయితే ఆ క్షమాపణపై షాలినీ స్పందిస్తూ.. నాగార్జున చెప్పడంతోనే త్రిగుణ్ సారీ చెప్పినట్లు అనిపిస్తోందని చెప్పింది. దీంతో నాగార్జున మరోసారి త్రిగుణ్‌ను హెచ్చరించి, తన కోపాన్ని మనుషులపై కాకుండా టాస్కులపై చూపించాలని సూచించారు. అనంతరం గార్డెన్ ఏరియాలో ఉన్న టైర్‌ను ఎత్తుకుని కొంతసేపు అటూ ఇటూ నడవాలని శిక్ష విధించారు.
త్రిగుణ్‌కు ఇంకేమైనా శిక్ష వేయాలా? అని నాగార్జున షాలినీని అడిగారు. ప్రతి విషయంలోనూ మధ్యలోకి వచ్చి మాట్లాడటం, ఎదుటివారిని పూర్తిగా మాట్లాడనివ్వకపోవడం త్రిగుణ్‌లో ఉన్న సమస్యలని ఆమె చెప్పింది. ఒకరోజంతా త్రిగుణ్‌ను మౌనంగా ఉంచితే ఎలా ఉంటుందో చూడాలని సూచించింది. అయితే నాగార్జున మాత్రం అక్కడే షాలినీకి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. “నీ గురించి కూడా నా అభిప్రాయం అదే” అంటూ.. మరి ఒకరోజంతా నువ్వే మౌనంగా ఉంటే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పారు. దీంతో షాలినీ ఒక్కసారిగా షాక్ అయ్యింది. తాను అంతసేపు మౌనంగా ఉండలేనంటూ సరదాగా నాగ్‌ను అడిగినా.. నాగార్జున మాత్రం తన నిర్ణయాన్ని మార్చలేదు.ఇక ‘వారానికి వెయ్యి’ అంటూ జరిగిన వ్యవహారంలో రాంప్రసాద్ చేసిన వ్యాఖ్యలను కూడా నాగార్జున ప్రస్తావించారు. సరదాగా మాట్లాడటం ఒకటైతే.. కొన్ని సందర్భాల్లో ఆ మాటలు హద్దులు దాటే అవకాశం ఉంటుందని చెప్పారు.అందుకే ఇంట్లో సరదా, కామెడీ పేరుతో ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరూ తమ హద్దులను గుర్తుంచుకోవాలని రాంప్రసాద్‌కు సూచించారు.