Washington Wildfire : అమెరికాలో అగ్నికీలలు (Washington wildfire) విధ్వంసం సృష్టిస్తున్నాయి. వాషింగ్టన్ రాష్ట్ర పరిధిలోని అటవీ ప్రాంతాన్ని కార్చిచ్చు దహించి వేస్తుండగా సమీపంలోని వేల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాజాగా మరో 60 వేలమందిని తాత్కాలిక శిబిరాలకు పంపారు. మంటలకు కారణమని భావిస్తున్న స్పోకేన్ చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ప్రస్తుతం వాషింగ్టన్ వ్యాప్తంగా 16 ప్రదేశాల్లో కార్చిచ్చు విస్తరించింది. వందల భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి. స్పోకేన్ ప్రాంతంలో మంటలు కొనసాగుతుండటంతో వాటిని అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బలమైన గాలులు, పొడి వాతావరణం కారణంగా మంటలను నియంత్రించడం సవాలుగా మారింది. నష్టం తీవ్రతను అంచనా వేస్తున్నట్లు స్పోకేన్ మేయర్ లీసా బ్రౌన్ వెల్లడించారు.
తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడిన తర్వాత.. వాషింగ్టన్ రాష్ట్ర గవర్నర్ బాబ్ ఫెర్గూసన్ రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు ఈ వారం ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
మంటలు చెలరేగుతున్న ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరవేయడంపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాంటి చర్యలను చట్టవిరుద్ధంగా పరిగణిస్తామన్నారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్న అగ్నిమాపక విమానాలు, హెలికాప్టర్లకు అవి ఆటంకం కలిగిస్తున్నాయని, డ్రోన్ల వల్ల ఆదివారం 26 సార్లు అగ్నిమాపక కార్యకలాపాలకు అంతరాయం కలిగిందని తెలిపారు.