ముంబై: తండ్రి చనిపోయినా తనతోనే ఉండాలని ఒక మహిళ భావించింది. ఈ నేపథ్యంలో నాలుగేళ్లుగా ఆయన మృతదేహాన్ని భద్రపరిచింది. అయితే దుర్వాసన రావడంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. (Woman Preserves Fathers Body) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. మలాడ్ ఈస్ట్ ప్రాంతంలో మూసివేసి ఉన్న ఒక డే కేర్ సెంటర్ నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటాన్ని స్థానికులు గమనించారు. రోజురోజుకూ ఆ వాసన మరింత తీవ్రం కావడంతో వారు అనుమానించారు. ఆ దుర్వాసన భరించలేనంతగా మారడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
కాగా, మూసి ఉన్న ఆ డే కేర్ సెంటర్ వద్దకు పోలీసులు చేరుకున్నారు. గేట్‌కు వేసి ఉన్న లాక్ బ్రేక్ చేసి లోపలకు వెళ్లారు. అక్కడ సోదా చేయగా కుళ్లిన స్థితిలో ఉన్న ఒక మృతదేహం కనిపించింది. పోలీసులు ఆరా తీయగా 2022లో ఆ వృద్ధుడు గుండెపోటుతో మరణించినట్లు తెలిసింది.
మరోవైపు మరణించిన తండ్రిని తనతోనే ఉంచుకోవాలని ఆయన కుమార్తె భావించింది. దీంతో మృతదేహాన్ని భద్రపరచాలని నిర్ణయించిన ఆమె అంత్యక్రియలు నిర్వహించలేదు. ఒక విదేశీ సంస్థ సహాయంతో తండ్రి మృతదేహాన్ని భద్రపరిచేలా ఏర్పాట్లు చేసింది.
అయితే తన తండ్రిపై ఆ మహిళకు ఉన్న అపారమైన ప్రేమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తున్నదని పోలీస్ అధికారి తెలిపారు. ఈ కేసులో తన తరఫున వాదించడానికి ఆ మహిళ న్యాయవాదులను నియమించుకున్నట్లు చెప్పారు. దీంతో కుటుంబపరమైన, చట్టపరమైన అంశాలను పరిశీలిస్తున్నట్లు పోలీస్ అధికారి వివరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.