కోదాడ, సెప్టెంబర్ 02 : కోదాడ నియోజకవర్గం మునగాల మండల పరిధిలో గడిచిన మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాగార్జునసాగర్ కాల్వ ఎత్తిపోతల పథకాలకు అమర్చిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నుండి కాపర్ దొంగతనం చేసిన నలుగురిని మునగాల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. డీఎస్పీ కార్యాలయంలో మునగాల సీఐ రామకృష్ణారెడ్డితో కలిసి డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. తమ ట్రాన్స్ఫార్మర్ల నుండి కాపర్ దొంగతనం చేస్తున్నారని మునగాల మండలానికి చెందిన పలువురు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు బరాకతగూడెం కెనాల్‌పై పలువురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా మునగాల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ విషయం వెలుగుచూసింది.
నిందితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు పట్టణానికి చెందిన పాలకుర్తి వెంకటరామయ్య. గుంటకల్ రాజేశ్వరరావు. బోయపాటి అశోక్. దేవరకొండ ఇషాన్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా మరో వ్యక్తి బలి శ్రీకాంత్ పరారీలో ఉన్నట్టు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. వీరి వద్ద నుండి రూ.2.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వెంకటరామయ్య గతంలో కూడా కాపర్ దొంగతనాలు చేశాడని, ఈ వైర్ ను ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో కిలో రూ.400 చొప్పున అమ్మినట్టు తెలిపారు. వీరంతా కలిసి సుమారు 5 క్వింటాళ్ల కాపర్ ను దొంగతనం చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల అరెస్ట్‌లో కీలకంగా వ్యవహరించిన మునగాల సీఐ డి.రామకృష్ణారెడ్డి. సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్ఐ బి.ప్రవీణ్ కుమార్, ఐడీ పార్టీ స్టాఫ్ రామారావు, కొండలు, సూర్యాపేట సీసీఎస్ ఎస్ఐ హరికృష్ణ, యాదవేంద్ర రెడ్డి, సిబ్బంది మల్లేశ్, శివ, ఆనంద్‌ను డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అభినందించారు.