కోరుట్ల, సెప్టెంబర్ 2: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కల్లూరు రోడ్డు కొత్త బస్టాండ్ మీదుగా కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలివచ్చి రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ (PC Ghosh Commission) నివేదిక తప్పులతడక అని, సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
కాళేశ్వరం బ్యారేజ్‌లపై విచారణ సాకుతో తెలంగాణ అస్తిత్వంపై దాడి చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ కుట్ర పన్నుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించే కుతంత్రాలకు కాంగ్రెస్ నేతలు తెరతీశారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్(KCR)పై అభాండాలు మోపితే సహించేది లేదని బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.
రాస్తారోకోలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారీశెట్టి రాజేష్, జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు చీటి వెంకటరావు, పట్టణ బీఆర్ఎస్ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ ఫహీం, ఉపాధ్యక్షుడు అస్లాం ఖురేషి, మాజీ ఎంపీపీ తోట నారాయణ, బీఆర్ఎస్ పట్టణ యూత్ అధ్యక్షుడు మహమ్మద్ అతీక్, నాయకులు బట్టు సునీల్, సజ్జు, పేర్ల సత్యం, మోసిన్, పొట్ట సురేందర్, చిత్తరి ఆనంద్, కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి, సింగిరెడ్డి నర్సారెడ్డి, కుమారస్వామి, భూమయ్య, నగేష్, నవీన్, అంజయ్య, కృష్ణంరాజు, అమేర్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.