T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. విజేతగా ఇండియా నిలవగా, రన్నరప్‌గా న్యూజిలాండ్ నిలిచింది. దీంతో విన్నర్, రన్నరప్ జట్లతోపాటు టోర్నీలో పాల్గొన్న మిగతా జట్లకు కూడా ఐసీసీ నిబంధనల ప్రకారం నగదు బహుమతి దక్కుతుంది. ఈ టోర్నీకి సంబంధించి మొత్తం ప్రైజ్‌మనీ వివరాల్ని ఐసీసీ వెల్లడించింది. దీని ప్రకారం టోర్నీ మొత్తానికి కలిపి రూ.103 కోట్లు (11.25 మిలియన్ డాలర్లు) ప్రైజ్‌మనీగా కేటాయించింది.
గ్రూప్స్, సూపర్ 8, సెమీ ఫైనల్స్, ఫైనల్ విన్నర్, రన్నరప్‌లకు వేర్వేరుగా నగదు అందుతుంది. ఇదంతా టోర్నీలో ఆయా జట్ల ప్రదర్శన మీద ఆధారపడి ఉంటుంది. ఈ టోర్నీలో పాల్గొన్న ప్రతి జట్టుకు కనీసం 225,000 యూఎస్ డాలర్లు అందుతాయి. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ.24.25 కోట్లు, రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు రూ.13.08 కోట్లు, సెమీ ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా జట్టుకు రూ.9.24 కోట్లు, ఇంగ్లండ్‌కు రూ.8.96 కోట్లు, వెస్టిండీస్‌కు రూ.4.95 కోట్లు, పాకిస్తాన్‌కు రూ.4.80 కోట్లు, జింబాబ్వేకు రూ.4.52 కోట్లు, శ్రీలంకకు రూ.4.38 కోట్లు, ఆఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, యూఎస్ఏ జట్లకు విడివిడిగా రూ.2.85 కోట్లు, స్కాట్లాండ్కు రూ.2.56 కోట్లు, ఐర్లాండ్‌కు రూ.2.50 కోట్లు, ఇటలీ, నెదర్లాండ్స్, నేపాల్, యూఏఈ జట్లకు రూ.2.35 కోట్లు, కెనడా, నమీబియా, ఒమన్ జట్లకు రూ.2.07 కోట్లు బహుమతిగా దక్కనున్నాయి.
వీటికి ఆయా దేశాలకు సంబంధించిన నిబంధనల ప్రకారం పన్నులుంటాయి. టోర్నీలో విజేతగా నిలిచిన భారత జట్టుకు ఐసీసీ అందించే బహుమతితోపాటు బీసీసీఐ కూడా రూ.131 కోట్ల నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే.