తుంగతుర్తి, మార్చి 11 : తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో బుధవారం అరుంధతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్ఠకు భూమి పూజ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మంజుల వెంకన్న భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అంటరానితనం నిర్మూలనకు పూలే ఎనలేని కృషి చేశారని, బడుగు బలహీన వర్గాల ప్రజలు చదువుతూనే సమాజంలో గుర్తింపు పొందుతారని భావించి వారి విద్య కోసం, హక్కుల కోసం చివరి శ్వాస వరకు పోరాటం చేసిన వ్యక్తి పూలే అని కొనియాడారు. సమాజానికి పూలే దంపతులు చేసిన సేవలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకుని వారి ఆశయాల సాధన కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జ్యోతిరావు పూలే నిర్మాణ కమిటీ అధ్యక్షుడు చింతకుంట్ల విఠల్, అరుంధతి యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.