మహబూబ్ నగర్ : జూరాల ప్రాజెక్టు ( Jurala project ) కు 27,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, మోటార్లును ఎందుకు ప్రారంభించడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) డిమాండ్ చేశారు.
జూరాల ప్రాజెక్టులో ఇప్పటికే 7.1 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకుందని వెల్లడించారు. మరికొద్ది గంటల్లో గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారని వివరించారు. పాలమూరు రైతుకు నీళ్లు అందించకుండా, ఆ నీటిని శ్రీశైలం ద్వారా ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడుకు వెళ్లేలా చేయడానికే పంపులను ఆన్ చేయడం లేదని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని, వరదొచ్చినప్పుడు నీటిని ఎత్తిపోయ కుండా కిందికి జార విడుస్తుందని విమర్శించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు.తక్షణమే భీమా-1లోని భూత్పూర్ (1.3 టీఎంసీ), సంగంబండ (3.3 టీఎంసీ), భీమా-2లోని శంకర సముద్రం (1.8 టీఎంసీ), రంగసముద్రం (1.9 టీఎంసీ), నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని గూడెందొడ్డి (1.2 టీఎంసీ) విడుదల చేసి నింపాలని కోరారు.
ర్యాలంపాడు (4 టీఎంసీ), అలాగే కోయిల్‌సాగర్ (1.5 టీఎంసీ) రిజర్వాయర్లను నింపేందుకు వెంటనే మోటార్లను ప్రారంభించాలని, జూరాల ఎడమ, కుడి కాలువలకు పూర్తి సామర్థ్యంతో నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.