ధర్మపురి, సెప్టెంబర్ 02: కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, ప్రజల దృష్టి మరల్చేందుకే కాళేశ్వరంపై సీబీఐ (CBI) దర్యాప్తు పేరుతో సీఎం రేవంత్ రెడ్డి కొత్త డ్రామలు అడుతున్నాడని డీసీఎమ్మెస్ చైర్మన్ డా. ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావ్లపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర హోం శాఖకు లేఖ రాయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం ధర్మపురి మండల బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. అంబేద్కర్ చౌక్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి బీఆర్ఎస్ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా డీసీఎమ్మెస్ చైర్మన్ డా. ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలను అణిచివేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అడ్డుపెట్టుకొని తెలంగాణ నీటి హక్కులను పాతరేసేందుకు కాంగ్రెస్ పన్నిన పన్నాగమని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, ప్రజల దృష్టి మరల్చేందుకే కాళేశ్వరంపై సీబీఐ విచారణ పేరుతో రేవంత్ రెడ్డి కొత్త డ్రామాలు ఆడుతాన్నాడని ఆయన విమర్శించారు.
నిన్నటి దాకా సీబీఐని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి నేడు అదే సీబీఐతో కాళేశ్వరంపై విచారణ చేయించాలని ఆసెంబ్లీలో తీర్మాణించడాన్ని చూస్తే ఈ వ్యవహారం వెనుక కుట్ర దాగి ఉన్నదని అర్ధమవుతుందని ఆయన అన్నారు. ఎటువంటి విచారణకైనా బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్ కుట్రలన్నింటినీ ప్రజలకు గమనిస్తున్నారనీ, రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సంఘీ సత్యమ్మ, నాయకులు అయ్యోరీ రాజేష్ కుమార్, సాళ్ల భీమయ్య, చిలివేరి శ్యాంసుందర్, సంగి శేఖర్, మహిపాల్‌రెడ్డి, చీర్నేని నర్సయ్య, చుక్క రవి. కుక్కల గంగారెడ్డి, కాశెట్టి విజయ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.