చండూరు, సెప్టెంబర్ 02 : తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి, గోదావరి నది జలాలను ఆంధ్రాకు తరలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నట్లు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం చండూరు మున్సిపల్ కేంద్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కుట్రలకు నిరసనగా భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు అందించి, రైతన్న ముఖంలో సంతోషాన్ని నింపిన కేసీఆర్ పై కాళేశ్వరం కమిషన్ విచారణ పేరిట తప్పుడు నోటీసులు పంపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్నో లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయని ఈ ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుట్రలను ఎదుర్కోవాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
బెదిరింపులు, కేసులు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చండూరు మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, చండూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొత్తపాటి సతీశ్, కౌన్సిలర్ కోడి వెంకన్న, అధికార ప్రతినిధి బొడ్డు సతీశ్ గౌడ్, ఉపాధ్యక్షుడు కురుపాటి సుదర్శన్, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పెద్దగోని వెంకన్న గౌడ్, ఇరిగి రామన్న, ఇరిగి గురునాథం, తేలుకుంట్ల చంద్రశేఖర్, మహిళ మండల అధ్యక్షురాలు పెండ్యాల గీత, సంగేపు సువర్ణ, బీఆర్ఎస్ అన్ని మండలాల అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.